India-Russia: రష్యా ఇచ్చిన ఆఫర్‌కు భారత్ ఊ అంటే.. వాహనదారులు ఫుల్ ఖుషీ! ఆ ఆఫర్ ఏమిటంటే..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ముడి చమురు ధర ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగింది. దీంతో ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడిన భారత్‌పై ఒత్తిడి పెరిగింది.

India-Russia: రష్యా ఇచ్చిన ఆఫర్‌కు భారత్ ఊ అంటే.. వాహనదారులు ఫుల్ ఖుషీ! ఆ ఆఫర్ ఏమిటంటే..
India Russia
Follow us

|

Updated on: Mar 14, 2022 | 5:05 PM

రష్యా, ఉక్రెయిన్(Russia Ukraine War) యుద్ధంతో ముడి చమురు ధర ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగింది. దీంతో ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడిన భారత్‌పై ఒత్తిడి పెరిగింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు(Crude Oil) లభ్యత బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో భారత్‌తో సహా పలు దేశాలు ముడి చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి.  ఈ సమయంలో రష్యా భారత్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రష్యా భారత్‌కు అతి తక్కువ ధరకే క్రూడాయిల్ విక్రయిస్తామని మరోసారి చెప్పింది. ఈసారి ఏకంగా రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నొవాక్(Novac) ఈ విషయం గురించి నేరుగా కేంద్రంతో మాట్లాడారని వార్తలు వస్తున్నాయి.

దీనిపై నోవాక్ కేంద్రమంత్రి హర్దిప్ పూరికి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలిసింది. కాగా.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడంపై అమెరికాతో సహా నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. రష్యాతో వాణిజ్యంపై కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో గడిచిన రెండు వారాలుగా రష్యా చమురు కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల పైకి చేరగా.. మరోవైపు రష్యా వద్ద కొనుగోళ్లు తగ్గడంతో భారీగా నిల్వలు పేరుకుపోతున్నాయి.

దీంతో రష్యా తమ మిత్ర దేశంగా భావించే భారత్‌కు క్రూడ్ ఆయిల్‌ను తక్కువ ధరలకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనతో తమ దేశంలో క్రూడ్ ఆయిల్‌ను కొంత మేర అమ్ముకునే సౌలభ్యం రష్యాకు దొరుకుతుంది. ఇక భారత్‌కు ఈ ఆఫర్‌ ద్వారా చౌకగా క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. అయితే ఇది అంత తేలికైన విషయం కాదు. రష్యా ఇచ్చిన ఆఫర్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విషయం వాస్తవమేనన్న కేంద్రం.. దానిపై నిర్ణయం తీసుకునేముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అమెరికా, యూరోపియన్‌ దేశాలకు వ్యతిరేకంగా అడుగులు వేసినట్లవుతుంది. రష్యా ఇచ్చిన ఆఫర్ ను ఓకే చేస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించవచ్చు. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ రష్యా ఆఫర్‌ భారత్ అంగీకరిస్తే దేశంలో ప్రజలకు ఆర్థికంగా మేలు జరిగే అవకాశం ఉంది.

Read Also.. Stock Market: తగ్గుతోన్న క్రూడ్ ఆయిల్ ధర.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..