Energy Storage: కరెంటును స్టోర్ చేసుకుని క్యాష్ చేసుకోవచ్చు.. మార్కెట్లోకి కొత్త ప్రాడక్ట్.. ధర ఎంతంటే?
కరెంటును ఇంట్లోనే స్టోర్ చేసుకుని అవసరం కొద్దీ వాడుకుంటే ఎంత సౌకర్యంగా ఉంటుందో కదా. వేలకు వేలు బిల్లులు కట్టేబదులు ఇలాంటి ఓ పరికరం ఉంటే ఎలా ఉంటుంది? అందుకే నగరంలో కొత్త ప్రాడక్ట్ లాంచ్ అయ్యింది. దీంతో మీ కరెంటు అవసరాలు తీరడంతో పాటుగా మిగిలిన కరెంటును అమ్ముకుని క్యాష్ చేసుకోవచ్చు. అదెలా అంటారా.. ఇది చదవండి.

ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ప్యూర్ సరికొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఇళ్లలో, వాణిజ్య ప్రదేశాలలో, గ్రిడ్ స్థాయిలో ఉపయోగించే ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ‘ప్యూర్-పవర్’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ ఉత్పత్తులు విద్యుత్తును నిల్వ చేసి అవసరానికి తగినట్లు వాడుకోడానికి వీలు కల్పిస్తాయి. సాధారణ యూపీఎస్‌లలో ఉండే లెడ్ ఆక్సైడ్ బ్యాటరీలకు బదులుగా అత్యాధునిక లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తాయి. సౌర విద్యుత్తు వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి వచ్చే విద్యుత్తును అదనపు పరికరాలు లేకుండా నిల్వ చేయగలవు. ఉదాహరణకు, ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ‘ప్యూర్-పవర్: హోం’ను వాడితే, ఇంటికి కావలసిన విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్తును ప్రభుత్వానికి అమ్మవచ్చు.
నీతీ ఆయోగ్ సభ్యుడు, డీఆర్‌డీవో మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి.కె.సారస్వత్ మంగళవారం హైదరాబాద్‌లోని నోవోటెల్‌లో ఈ ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు. ప్యూర్ సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిశాంత్ దొంగరి మాట్లాడుతూ, “దేశమంతటా రానున్న 18 నెలల్లో 300 మంది డీలర్ల ద్వారా ‘ప్యూర్-పవర్’ ఉత్పత్తులను మార్కెట్ చేయనున్నాము” అని తెలిపారు. ఈ ఉత్పత్తులు యూపీఎస్‌లతో పోలిస్తే ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనవని, నానో పీసీఎం మెటీరియల్ ద్వారా భద్రతను పెంచామని చెప్పారు. ప్రస్తుతం రెండు రకాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని, గ్రిడ్ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసే ‘ప్యూర్-పవర్: గ్రిడ్’ను వచ్చే ఏడాది లాంచ్ చేస్తామన్నారు. ఇళ్లలో, అపార్ట్‌మెంట్లలో వాడేందుకు ‘ప్యూర్-పవర్: హోం’ 3 కిలోవోల్ట్ ఆంపియర్ (కేవీఏ), 5 కేవీఏ, 15 కేవీఏ సామర్థ్యాల్లో లభిస్తుందని, ధర రూ.74,999 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు.
దుకాణాలు, కార్యాలయాలు, టెలికాం టవర్స్ కోసం 25 కేవీఏ నుంచి 100 కేవీఏ సామర్థ్యం గల ‘ప్యూర్-పవర్ కమర్షియల్’ను అందుబాటులోకి తెస్తున్నామని నిశాంత్ చెప్పారు. ఈ ఉత్పత్తులు డీజిల్ జనరేటర్ల అవసరాన్ని తగ్గిస్తాయని తెలిపారు. గ్రిడ్ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసే మూడో ఉత్పత్తి ‘ప్యూర్-పవర్: గ్రిడ్’ 20 అడుగుల పొడవైన కంటెయినర్‌లో ఇమడగలదని, దీనిలో నాలుగు మెగావాట్ల విద్యుత్తును నిల్వ చేయవచ్చని వివరించారు. సోలార్ పార్కుల్లో దీనిని ఏర్పాటు చేస్తే, విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఎక్కువ డిమాండ్ ఉన్న సమయంలో సరఫరా చేయడానికి వీలవుతుందన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఉత్పత్తులను బుక్ చేసుకోవచ్చని, నెలాఖరు నుంచి డెలివరీ మొదలవుతుందని తెలిపారు.
దేశ అభివృద్ధికి కీలకం
2070 నాటికి కర్బన్ ఉద్గారాలను సున్నాస్థాయికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో విద్యుత్తు వాహనాలతోపాటు ‘ప్యూర్-పవర్’ లాంటి ఉత్పత్తులు ఎంతగానో ఉపయోగపడతాయని నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ స్పష్టం చేశారు. 2030 నాటికి వాహనాల్లో 40 శాతం విద్యుత్తుతో నడిచేలా చేయాలని ప్రభుత్వం తీర్మానించిందని, కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించిందని వివరించారు. అయితే, ప్రస్తుతం దేశంలో విద్యుత్తు వాహనాల సంఖ్య ఇరవై లక్షలకు మించడం లేదని తెలిపారు. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ కోసం గ్రిడ్‌ను వాడితే గ్రిడ్‌పై అధిక భారం పడుతుందని, ఈ సమస్యను పరిష్కరించడానికి ‘ప్యూర్-పవర్’ లాంటి ఉత్పత్తులకు ప్రాధాన్యత ఏర్పడుతోందని అన్నారు. బ్యాటరీల ధరలను తగ్గించేందుకు, మరింత సమర్థవంతమైన వాటిని తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తే మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్యూర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వడేరా తదితరులు పాల్గొన్నారు.