Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Repo Rate: వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఈసారికి యధాతథం..

RBI MPC Meet: వడ్డీ రేట్ల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. యధాతథంగా ఉంటాయని ప్రకటించింది ఆర్బీఐ. ప్రస్తుతం రెపో రెటు 6.50 శాతం అలాగే కొనసాగుతుందని ప్రకటించారు ఆర్బీఐ చైర్మన్ శక్తికాంత దాస్‌.

RBI Repo Rate: వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఈసారికి యధాతథం..
Rbi Governor
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 06, 2023 | 12:03 PM

వడ్డీ రేట్ల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. యధాతథంగా ఉంటాయని ప్రకటించింది ఆర్బీఐ. ప్రస్తుతం రెపో రెటు 6.50 శాతం అలాగే కొనసాగుతుందని ప్రకటించారు ఆర్బీఐ చైర్మన్ శక్తికాంత దాస్‌. ఎస్‌డీఎఫ్‌ రేటు 6.25 శాతం, ఎంఎస్‌ఎఫ్‌ రేటు 6.75 శాతం, బ్యాంక్‌ రేటు 6.75 శాతంగా కొనసాగుతాయని తెలిపారాయన. 2023-24కు సంబంధించి ఈ నెల 3వ తేదీన ద్రవ్యపరపతి విధానంపై సమీక్ష ప్రారంభమవగా.. ఆ సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. రెపో రేట్ యధావిధంగా కొనసాగింపునకు మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు.

పరుగులు పెడుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆర్‌బీఐ గత ఏడాది మే నెల నుంచి వడ్డీరేట్లను పెంచుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అలాగే పెంచుతారని నిపుణులు సైతం భావించారు. కానీ, నిపుణుల అంచనాలను తలకిందులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. కాగా, ఆర్బీఐ ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. 2023 ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.44 శాతంగా నమోదైంది. అంతకు ముందు నెలలో ఇది 6.52 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు ఆర్బీఐ గవర్నర్. ఈ ఏడాది 5.2 శాతం, తొలి త్రైమాసికంలో 5.1 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు.

ఇదిలాఉంటే.. దేశ బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయన్నారు శక్తికాంత దాస్. 2022-23 సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే 2023-24 జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 6.4 శాతం నుంచి 6.5 శాతానికి పెంచారు. 2022-23లో రూపాయి కదలికలు క్రమబద్ధంగా కొనసాగాయన్నారు ఆర్బీఐ గవర్నర్. ఇటీవల బ్యాంక్‌ పతనాల పరిణామంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటి పర్యవసానాలపైనా ఆర్‌బీఐ దృష్టి సారించిందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..