PMJJBY: కేవలం రూ.20 చెల్లించండి.. రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం పొందండి..
2015 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక భద్రతా పథకాల్లో ఇదీ ఒకటి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజనతో పాటు దీన్ని ప్రకటించారు...
2015 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక భద్రతా పథకాల్లో ఇదీ ఒకటి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజనతో పాటు దీన్ని ప్రకటించారు. ఇంతకీ సురక్షా బీమా యోజన పథకం అంటే ఏమిటి? దీనికి అర్హులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం పొందినా ఈ పథకం అండగా ఉంటుంది. దీని కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలో చేరొచ్చు. ఇందుకోసం ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే, అప్పుడు మీరు ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరాల్సి ఉంటుంది.
ఈ పథకానికి వర్తించే ప్రీమియంను ఇటీవలే ప్రభుత్వం పెంచింది. ఏడాదికి రూ. 12 నుంచి రూ.20కి పెంచింది. దీంతో పాటు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రీమియంను కూడా పెంచారు. ఇంతకు ముందు పీఎంజేజేబీవై ప్రీమియం రూ.330 ఉంటే ఇప్పుడు దాన్ని రూ.436కి పెంచింది. అంటే రెండు పథకాలకు కలిపి రోజుకి రూ.1.25 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులకు ఆటో డెబిట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 1లోగా మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ పద్ధతిలో కట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ జూన్ 1 తర్వాత ఆటో డెబిట్ పద్ధతి ద్వారా మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లయితే ఆ తేదీ నుంచి బీమా పథకం అమలు చేస్తారు. ప్రతి సంవత్సరం జూన్ 1లోగా పాలసీని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. ఎవరైనా చందాదారుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ఉన్నా ఒక్క బ్యాంక్ ద్వారా మాత్రమే ప్రీమియం తీసుకుంటారు.