PPF VS ELSS: పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్.. ఇందులో ఏది బెటర్..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీమ్స్ (ELSS) ఈ రెండు పన్ను ఆదా చేసే పొదుపు పథకాలు...
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీమ్స్ (ELSS) ఈ రెండు పన్ను ఆదా చేసే పొదుపు పథకాలు. సెక్షన్ 80సీ కింద ఈ రెండింటిలో పెట్టుబడులకు ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు అవకాశం ఉంటుంది. అయితే, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభించే పథకాలకు వేర్వేరు రాబడులు, రిస్క్, లాక్-ఇన్ పీరియడ్, పన్నులు ఉంటాయి. పన్ను ఆదా చేసేందుకు పెట్టుబడులు పెట్టేముందు వీటన్నింటిని పరిశీలించాలి.
పదవీ విరమణ జీవితం కోసం నిధిని ఏర్పాటు చేసుకునేందుకు, పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పీపీఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతీయులు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. పిల్లల పేరుతో కూడా పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు. తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ జాయింట్‌గా ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఏడాదికి కనీసం రూ.500, గరిష్ఠగా రూ.1.50 లక్షల వరకు ఖాతాలో జమచేయవచ్చు. దీనికి 15 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత 5 సంవత్సరాల చొప్పున కాలవ్యవధి పొడిగించుకోవచ్చు. ఏడవ ఆర్ధిక సంవత్సరం నుండి పాక్షిక నగదు ఉపసంహరణలను అనుమతిస్తారు.
ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ పథకాలు పన్ను ప్రయోజనాలను, స్టాక్ మార్కెట్ల రాబడులను అందిస్తాయి. ఈఎల్ఎస్ఎస్‌లో మొత్తం నిధి నుంచి 80 శాతం నిధిని లార్జ్ కాప్, మిడ్ కాప్, స్మాల్ కాప్ ఈక్విటీలలో పెట్టుబడి పెడతారు. అందువల్ల మల్టీ క్యాప్ ఫండ్ల మాదిరిగానే రాబడులు ఉంటాయి. కనీస లాక్ ఇన్ పిరియడ్ 3 సంవత్సరాలు. ఇతర ఈక్విటీ ఫండ్లలో లాగా ఇందులో కూడా కనీసం 10 ఏళ్ల మదుపు చేస్తే మంచి రాబడి పొందే వీలు ఉంటుంది, స్వల్ప కాలం లో నష్ట భయం ఉంటుంది.
పన్ను ఆదా చేసే పెట్టుబడులకు పీపీఎఫ్ ప్రాచుర్యం పొందింది. ఇది డెట్ పథకం, కచ్చితమైన రాబడిని అందిస్తుంది. పెట్టుబడులు, రాబడి, ఉపసంహరణపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు పన్ను మినహాయింపు, దానిపై లభించే రాబడికి పన్ను వర్తించదు. ఇక పూర్తి ఉపసంహరణపై కూడా పన్ను లేదు. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ సంబంధిత సాధనాలలో పెట్టుబడులు పెడుతుంది. ఇక్కడ కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, 1 ఏడాది దాటిన తర్వాత పెట్టుబడులపై రాబడి లక్ష దాటితే 10 శాతం పన్ను వర్తిస్తుంది.
Read Also… Budget-2022: ఈ బడ్జెట్‌లో ఆ లాభాలపై పన్ను మినహాయిస్తారా.. నిపుణులు ఏం చెబుతున్నారు..