PPF Account: పిల్లలకూ పీపీఎఫ్ ఖాతాలు.. నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..?
ఆకర్షణీయమైన వడ్డీరేటుతో పాటు అధిక రాబడిని అందించే పెట్టుబడి పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. దీనికిపై వచ్చే ఆదాయానికి (వడ్డీ, రాబడి) పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. చిన్న మొత్తాలను పొదుపు చేయడం ద్వారా అధిక రాబడి పొందవచ్చు. ఈ పథకానికి ప్రభుత్వం మద్దతు ఉండడం, ఎటువంటి రిస్కు లేకపోవడంతో ఎలాంటి ఆందోళన ఉండదు. రిటైర్మెంట్ సమయానికి సంపదను పోగుచేసుకోవాలనుకునే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. అయితే పెద్దలతో పాటు పిల్లల పేరు మీద కూడా ఈ ఖాతాలను ప్రారంభించవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత ప్రభుత్వం 1968 జూలై ఒకటిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని ప్రారంభించింది. పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన రాబడితో పాటు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. అయితే పెట్టుబడిదారులు తమ మైనర్లయిన పిల్లల పేరుమీద కూడా పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. ఆ ఖాతాకు మీరే సంరక్షకులుగా ఉంటారు. అయితే మీ ఖాతాతో పాటు మీ పిల్లల ఖాతాలో వార్షిక డిపాజిట్ రూ.1.50 లక్షలకు మించకూడదు. ఉదాహరణకు మీ సొంత పీపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, అదే ఏడాది పిల్లల ఖాతాలో రూ.50 వేలు మాత్రమే జమచేయాలి.
నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన పేరుమీద ఒక పీపీఎఫ్ ఖాతాను మాత్రమే తెరవొచ్చు. వేర్వేరు పోస్టాఫీసులు, బ్యాంకులను సంప్రదించినా రెండో ఖాతా ఇవ్వరు. ఒక వేళ తెరిచినా ఆ అదనపు ఖాతా చెల్లదు. ఒకవేళ అనుకోకుండా రెండో ఖాతాను తెరిస్తే సంబంధిత బ్యాంకు, పోస్టాఫీసు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేయండి. వెంటనే రెండో ఖాతాను మూసివేస్తే, మీ డిపాజిట్ ను వెనక్కు ఇచ్చేస్తారు. కానీ ఆ మొత్తంపై వడ్డీ మాత్రం ఇవ్వరు.
- ప్రభుత్వ మద్దతుతో కూడిన ధీర్ఘకాలిక పొదుపు పథకమైన పీపీఎఫ్ భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంది. పెద్దలతో పాటు పిల్లల పేరు మీద కూడా వీటిని తెరవొచ్చు.
- వార్షిక డిపాజిట్ గా కనీసం రూ.500 చేయాలి. గరిష్టంగా రూ.1.50 లక్షలకు మించకూడదు. ఏడాదికి 12 వాయిదాల్లో వీటిని చెల్లించవచ్చు.
- పీపీఎఫ్ ఖాతా కాలపరిమితి 15 ఏళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.
- దీనిపై వడ్డీరేటును త్రైమాసికానికి ఒకసారి ఆర్థిక మంత్రిత్వశాఖ సవరిస్తుంది.
- చందాదారుడి అభ్యర్థన మేరకు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు, లేదా ఒక బ్యాంకు శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేసుకోవచ్చు.
- పీపీఎఫ్ ఖాతాలో 15 ఏళ్ల పాటు ఏటా కనీసం ఒక్కసారైనా డిపాజిట్ చేయాలి. ఖాతా తెరిచి సమయంలో, లేదా ఆ తర్వాతైనా నామినీ వివరాలు నమోదు చేయించుకోవాలి.
- ఖాతాపై మూడో ఏట, ఐదో ఏట రుణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిబంధనల ప్రకారం ఖాతా కాలపరిమితి పూర్తయిత తర్వాతే నగదు విత్ డ్రా చేసుకోవాలి.
