November: బిగ్ అలర్ట్.. ఒక్కరోజే మిగిలి ఉన్న గుడువు.. నవంబర్ 30లోపు చేయాల్సిన పనులు ఇవే..
నెల ముగిసిపోతుందంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. వీటిని పూర్తి చేయకపోతే మనం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నెలలోపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ 30లోపు ఇవి పూర్తి చేయాలి.

కొత్త నెల వస్తుందంటే బ్యాంకింగ్ లేదా కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, ధరలు విషయాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే కొత్త నెల వస్తుందంటే ఆలోపు పూర్తి చేయాల్సిన పనులు ఏంటనేది మనం అవగాహన కలిగి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం నవంబర్ నెల పూర్తి కావడానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. డిసెంబర్ నుంచి పలు కొత్త మార్పులు రానుండగా.. ఈ నెల 30తేదీ లోపు పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఈ పనులు మీరు పూర్తి చేయకపోతే కొన్ని సర్వీసులు, పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది.
UPSకి మారడానికి చివరితేదీ
నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి ఏకీకృత పెన్షన్ పథకంకు మారాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 30వరకు గడువు ఇచ్చారు. రేపటితో గడువు తేదీ ముగుస్తుండటంతో ఉద్యోగులు వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాల్సి ఉంది. సీఆర్‌ఏ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మీరు ఆ పని చేసుకోవచ్చు. లేదా నోడల్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుని ఆఫ్‌లైన్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయొచ్చు. నవంబర్ 30 తర్వాత మీరు ఇక మార్చుకోవడానికి వీలు పడదు.
mCash సేవలు నిలిపివేత
ఇక నవంబర్ 30 తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా mCash సేలలను పూర్తిగా నిలిపివేయనుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్ ఎస్బీఐ లేదా యోనో లైట్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా mCASH డబ్బు పంపే సేవలను ఎస్బీఐ అందించింది. కానీ ఆ సేవలను తొలగించిన ఎస్బీఐ.. UPI, IMPS, NEFT, RTGS వంటి విధానాలనే వాడాలని సూచించింది.
లైఫ్ సర్టిఫికేట్
ప్రభుత్వ నుంచి పెన్షన్ తీసుకునేవారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి నవంబర్ 30 వరకే గడువు ఉంది. ఆ లోపు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. లేపపోతే డిసెంబర్ 1 నుంచి మీకు పెన్షన్ చెల్లింపు ఆగిపోవచ్చు. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వ్యవస్థ ద్వారా పెన్షనర్లు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ప్రతీ సంవత్సరం కన్ఫర్మేషన్ కోసం ఈ సర్టిఫికేట్ సమర్పించడం అనేది తప్పనిసరి.




