CIBIL Score: మీ సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉందా? డోంట్ వర్రీ.. ఇలా చేస్తే 800కి పెంచుకోవచ్చు!
సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువ ఉంటేనే బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే, రుణం పొందడం కష్టం. కానీ, క్రెడిట్ రిపోర్టును జాగ్రత్తగా పరిశీలించి, EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించడం ద్వారా సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవచ్చు. అవసరమైతే, చిన్న రుణాలను తీసుకొని సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు.

ఏదైనా అవసరమై లోన్ తీసుకోవాలంటే.. బ్యాంక్ వాళ్లు, ఇతర లోన్ యాప్స్ అడిగేది సిబిల్ స్కోర్. 300 నుంచి 900 వరకు ఈ సిబిల్ స్కోర్‌ను లెక్కిస్తారు. కనీసం 650కి పైగా ఉంటేనే మీకు సదరు బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయి. అంతకంటే తక్కువ ఉంటే రిస్క్ ఎక్కువగా ఉన్నా కొన్ని బ్యాంకింగేతర సంస్థలు రుణాలు మంజూరు చేస్తాయి. 400 కంటే తక్కువ ఉంటే మాత్రం ఏ బ్యాంక్, ఫైనాన్స్ సంస్థలు అస్సలు లోన్లు ఇవ్వరు. మరి తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి? దాన్ని మెరుగుపర్చుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. మీరు తీసుకున్న రుణాలు క్రెడిట్ కార్డు బాకీలు, ఇతర లోన్ల ఆధారంగా ఈ క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ అనేది మీ పేరిట నమోదు అవుతుంది.
మీరు సరిగా అప్పులు చెల్లించకపోతే క్రెడిట్ కార్డు బిల్లులు బాకీ ఉన్నట్లయితే మీకు క్రెడిట్ స్కోర్ దాదాపు 400 కు పడిపోయే అవకాశం ఉంటుంది. 400 కు పడిపోతే మీకు దాదాపు బ్యాంకుల నుంచి రుణాలు రావు. మొదట మీ క్రెడిట్ స్కోరు అసలు ఎందుకు తగ్గిందో గమనించాలి. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. మీకు సంబంధం లేకుండా ఏవైనా రుణాలు మీ పేరిట నమోదు అయితే వెంటనే బ్యాంకును సంప్రదించి సెటిల్ చేసుకోవాలి. లేకపోతే మీ సిబిల్ స్కోరును ఇవి దెబ్బతీస్తాయి. మీ రుణ EMIలు మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను ప్రతి నెలా సకాలంలో పూర్తిగా చెల్లించండి. మిస్ అయిన చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్‌ను నెగిటివ్ గా ప్రభావితం చేస్తాయి. ఒక నిర్దిష్ట నెలలో మీ బిల్లును చెల్లించడంలో మీకు ఇబ్బంది ఉంటే, గడువు తేదీలోపు మినిమం మొత్తాన్ని చెల్లించాలి.
మీరు క్రెడిట్‌కు పూర్తిగా కొత్తవారైతే లేదా అనివార్య పరిస్థితుల కారణంగా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిన్నట్లయితే, చిన్న మొత్తంలో వ్యక్తిగత రుణం తీసుకోవాలి. వీటికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చు. అయితే మీరు సకాలంలో చెల్లింపులు చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌ను నెమ్మదిగా పెంచుకోగలరు. ఒక్కోసారి మీ క్రెడిట్ స్కోరు భారీగా పడిపోయినట్లయితే వెంటనే కొన్ని సెక్యూర్డ్ రుణాలు తీసుకొని మీ ఈఎంఐ చెల్లింపులు, క్రెడిట్ కార్డు చెల్లింపులు పూర్తి చేసుకుంటే మంచిది. ఉదాహరణకు గోల్డ్ లోన్, ఆస్తి పత్రాలు తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం వంటివి చేయవచ్చు. అలా రుణాలు తీసుకొని.. టైమ్ టూ టైమ్ ఈఎంఐలు చెల్లిస్తే.. పడిపోయిన మీ సిబిల్ స్కోర్ మళ్లీ పెరుగుతుంది. ఇదంతా ఎందుకు అనుకుంటే.. అసలు ముందే సిబిల్ స్కోర్ తగ్గకుండా సకాలంలో లోన్ వాయిదాలు చెల్లించుకుంటూ వెళ్లండి.
మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.