Mutual funds: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు వద్దంటే డబ్బు.. ఈ ఏడాది ఎంత రాబడి ఇచ్చాయంటే..?
మ్యూచువల్ ఫండ్స్ కు ఇటీవల కాలంలో ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీర్ఘకాలంలో అధిక రాబడి కోరుకునే వారికి వీటి వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వీటిలో పెట్టుబడులకు కొంచె రిస్కు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది.
బ్యాంకుల్లోని ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలను నుంచి వచ్చే వడ్డీతో పోల్చితే మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రాబడి అధికంగా ఉంటుంది. అలాగే వీటిలో పెట్టుబడులు పెట్టడం కూడా చాాలా సులభమే. ఈ నేపథ్యంలో 2024లో వీటిలో పెరిగిన పెట్టుబడులు, ఇన్వెస్టర్లకు వచ్చిన రాబడి వివరాలు ఇలా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ను వాడుక భాషలో ఎంఎఫ్ లు అని పిలుస్తారు. ఇవి 2024లో ఇన్వెస్టర్లకు 35 శాతం కంటే ఎక్కువ రాబడిని అందజేశాయి. ఈ పరిశ్రమ ఈ ఏడాది బలమైన ప్రగతి సాధించింది. వీటిలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. దానికి అనుగుణంగానే పెట్టుబడి దారులకు రాబడి బాగా వచ్చింది. మున్ముందు ఇవి మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలో ఆస్తులు (ఏయూఎం) ఈ ఏడాది బాగా పెరిగాయి. నవంబర్ నాటికి 68.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి 2023లో రూ.50.24 లక్షల కోట్లు మాత్రమే ఉండేవని లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రకారం ఏడాదిలో దాదాపు 35.50 శాతం పెరుగుదలను నమోదైంది. వివిధ ఫండ్స్ లో పెరిగిన పెట్టుబడులు ఈ కింద విధంగా ఉన్నాయి.
ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్
ఓపెన్ ఎండ్ ఎంఎఫ్ స్కీమ్ లో ఏ సమయంలోనైనా కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. వీటికి మెచ్యూరిటీ పిరియడ్ లేదు. వీలున్నంతకాలం పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఏడాది వీటిలో సుమారు 5.13 కోట్ల ఫోలియోలు వచ్చాయి. మొత్తం 22.02 కోట్లకు చేరుకున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) డేటా ప్రకారం 2024లో దీనిలో 174 ఓపెన్ ఎండ్ స్కీమ్ లు చేరాయి. నవంబర్ నాటికి మొత్తం పథకాల సంఖ్య 1,552కి పెరిగింది.
ఈక్విటీ ఫండ్స్
ఈక్విటీ ఫండ్స్ గణనీయమైన ప్రగతి సాధించాయి. మిడ్, స్మాల్ క్యాప్ లతో పాటు థిమాటిక్ ఫండ్ లలో పెట్టుబడులు బాగున్నాయి. ఆయా రంగాలలో ప్రగతితో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తితోనే ఈ విజయం సాధ్యమైంది. ఈ ఏడాది జనవరిలో 11.64 కోట్లు ఉన్న పెట్టుబడులు నవంబర్ కు రూ.15.41 కోట్లకు పెరిగాయి. ఏడాదిలో 54 కొత్త పథకాలు వచ్చి చేరాయి. దీంతో మొత్తం ఈక్విటీ పథకాల సంఖ్య 481కి చేరింది. ఇక సెక్టోరల్, థిమాటిక్ ఫండ్ ఫోలియోలో పెరుగుదల చాలా బాగుంది. నవంబర్ నాటికి 2.89 కోట్లకు చేరుకున్నాయి.
ఎస్ఐపీ
సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లు (ఎస్ఐపీ) కూడా ఈ ఏడాది నవంబర్ నాటికి రూ.25,320 కోట్లకు చేరాయి. ఇవి 2023 డిసెంబర్ నాటికి రూ.17,610 కోట్లుగా ఉన్నాయి. అంటే దాదాపు ఏడాదిలోనే 44 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. హైబ్రిడ్ ఎంఎఫ్ లు 1.50 కోట్లకు చేరుకున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..