Indian Railways: భారత రైల్వేల అరుదైన ఘనత.. కేబుల్ స్టేడ్ వంతెనపై ట్రయల్ రన్ పూర్తి
భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనం రైలు ప్రయాణం ఉంది. రోజూ కోట్లాది మంది ప్రజలు తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి భారత రైల్వేలు నూతన లైన్ల నిర్మాణంతో పాటు సరికొత్త బ్రిడ్జిలను కూడా నిర్మిస్తుంది.
తాజాగా భారత రైల్వే శాఖ అరుదైన ఘనత సాధించింది. జమ్మూ అండ్ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఉన్న భారతదేశపు మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన అయిన అంజి ఖాడ్ వంతెనపై టవర్ వ్యాగన్‌కు సంబంధించిన ట్రయల్ రన్‌ను పూర్తి చేసింది. ముఖ్యంగా ఈ బ్రిడ్జి కశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానిస్తుంది. ట్రయల్ రన్ పూర్తయిన నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ జనవరి 2025 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రాజెక్ట్ పురోగతిని పేర్కొంటూ ఎక్స్‌లో ట్రయల్ రన్ వీడియోను పంచుకున్నారు.
ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్‌లో కీలకమైన అంజి ఖాడ్ వంతెనపై ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని రైల్వే శాఖ కూడా అధికారికంగా ప్రకటించింది. గత నెలలో పూర్తయిన అంజి ఖడ్ వంతెన నదీగర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఉన్న ఒకే పైలాన్‌ను ఉన్న ఒక ఇంజనీరింగ్ అద్భుతమని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జ్ సెంట్రల్ స్పాన్‌లపై 48 కేబుల్‌ల ద్వారా మద్దతు ఇస్తుంది. ఈ బ్రిడ్జి మొత్తం 473.25 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే వయాడక్ట్ 120 మీటర్లు, సెంట్రల్ కట్ట 94.25 మీటర్లు విస్తరించి ఉంది.
ఈ బ్రిడ్జి నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ప్రపంచ రికార్డును కలిగి ఉన్న చీనాబ్ వంతెన తర్వాత ఈ వంతెన భారతదేశంలో రెండవ ఎత్తైన రైల్వే వంతెన. రెండు వంతెనలు ఈ ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి రూపొందించిన ప్రతిష్టాత్మక యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంటుంది. అధికారుల నివేదికల ప్రకారం యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్ 272 కిలోమీటర్లు విస్తరించి ఉంది. 255 కిలోమీటర్లు పూర్తయ్యాయి. కత్రా, రియాసి మధ్య మిగిలిన విస్తరణ డిసెంబర్ 2024 నాటికి పూర్తయ్యేలా ఉంది. కశ్మీర్ నుంచి న్యూఢిల్లీకి అనుసంధానం చేసే వందే భారత్ రైలును జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ నవంబర్‌లో ప్రకటించిన విషయం విధితమే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..