MG Cyberster EV: తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేస్తుందండోయ్.. జనవరిలో విడుదల..?
ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతంగా పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అనేక మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ తో నడిచే వాహనాలకు ఇవి ప్రత్యామ్నాయంగా మారాయి. మధ్యతరగతి ప్రజల నుంచి సంపన్నుల వరకూ అందరికీ అనువైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లో ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన ఓ కొత్త స్పోర్ట్స్ కారు వచ్చి చేరనుంది. జేఎస్ డబ్ల్యూ, ఎంజీ సంయుక్తంగా రూపొందించిన ఈ కారుకు ఎంజీ సైబర్ స్టర్ అనే పేరు పెట్టారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ కారు విడుదల కానుంది.
జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్స్ వచ్చే ఏడాది జనవరిలో తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు సైబర్ స్టర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ కారు ప్రత్యేకతలు, ఫీచర్లను వెల్లడించింది. మంచి డ్రైవింగ్ అనుభూతి కలిగేలా కొత్త కారును రూపొందించారు. దీని పనితీరు, పరిధి. ఇతర అంశాల గురించి తెలుసుకుందాం. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారుగా సైబర్ స్టర్ ఎంజీ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి జేఎస్ ఈవీ, కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీ కార్లు విడుదలైన సంగతి తెలిసిందే. వీటి జాబితాలో కొత్తగా సైబర్ స్టర్ చేరనుంది. దేశంలోని ఎంజీ కంపెనీకి చెందిన డీలర్ షిప్ ల ద్వారా మాత్రమే ఈ కారు విక్రయాలు జరుగుతాయి. ఇందుకోసం 12 ప్రధాన నగరాల్లో 12 కొత్త, ప్రత్యేకమైన లగ్జరీ షోరూమ్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సైబర్ స్టర్ కార్లను ప్రారంభంలో పరిమితి సంఖ్యలోనే సరఫరా చేస్తారు.
ఎంజీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే ఈవీ వెనుక ఐదు లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్, ఫ్రంట్ డబుల్ విష్ బోన్, ఏరో డైనమిక్ కమ్ బ్యాక్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. అలాగే దేశంలో సీజర్ డోర్లు కలిగిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. భద్రత కోసం డ్యూయల్ రాడార్ సెన్సార్లు, యాంటీ పించ్ మెకానిజం ఏర్పాటు చేశారు. ఈ ఓపెన్ టాప్ స్పోర్ట్స్ కారు పొడవు 4,533 ఎంఎం, వెడల్పు 1,912 ఎంఎం, ఎత్తు 1,328 ఎంఎం, వీల్ బేస్ 2,689 ఎంఎం ఉంటాయని సమాచారం. ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ప్రీమియం సెగ్మెంట్ లో సైబర్ స్టర్ అత్యంత శక్తివంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో 77 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఇది సన్నగా ఆకట్టుకునేలా ఉంటుంది. దీన్ని ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 570 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది.
కారు ముందు, వెనుక చక్రాలపై డ్యయల్ ఎలక్ట్రిక్ మోటారు ను అమర్చారు. దీని నుంచి 503 బీహెచ్ పీ శక్తి, 710 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ గరిష్ట వేగంతో ప్రయాణం చేయవచ్చు. కేవలం 3.2 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. ఈ కారును 2021లో మొదటిసారిగా ప్రకటించారు. అనేక పరీక్షల అనంతరం దీన్ని ప్రదర్శనకు ఉంచారు. 2025లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి