GST Council Raises Tax: సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
కారును కొనుగోలు చేయాలని, దానిలో దూర ప్రాంతాలకు విహారానికి వెళ్లాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని చాలా మంది కోరుకుంటారు. కానీ కార్ల ధరలు ఎక్కువగా ఉండడంతో తమ కోరికను తీర్చుకోలేరు. అయితే కొందరు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. మంచి కండీషన్ లో ఉండే వాహనాల కోసం ఎదురు చూస్తారు. ప్రస్తుతం ఈ సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ లాభసాటిగా జరుగుతుంది. వీటి అమ్మకాలు జరిపే డీలర్లు బాగా పెరిగారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సెకండ్ హ్యాండ్ కార్లపై ఉన్న జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జైసల్మేర్ లో డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు వస్తువులపై ఉన్న జీఎస్టీ శ్లాబులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పాప్ కార్న్ నుంచి పాత కార్ల వరకూ వర్తింపజేశారు. దీనిలో భాగంగా పాత కార్ల విక్రయాలపై ఇప్పటికే ఉన్న 12 శాతం పన్నును 18 శాతానికి పెంచారు. నిబంధనల ప్రకారం 1200 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4 వేల ఎంఎం కంటే ఎక్కువ పొడవైన పెట్రోల్ కార్లు, 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4 వేల ఎంఎం కంటే పొడవైన డీజీల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లపై కూడా ఇప్పటి వరకూ 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీని పొడిగిస్తూ కొత్తగా నిర్ణయం తీసుకున్నారు.
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పాత కార్లలపై 18 శాతం పన్ను వసూలు చేస్తారన్నది నిజమే. అయితే ఇది వ్యక్తిగతంగా కార్లను విక్రయించిన వారికి వర్తించదు. కేవలం పాత కార్లను అమ్మే డీలర్లపైనే పడుతుంది. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి తన కారును విక్రయిస్తే ఎలాంటి పన్ను కట్టనవసరం లేదు. అమ్మేవారు, కొనేవారికి కూడా నిబంధన వర్తించదు. కానీ సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే డీలర్ల నుంచి వాహనాన్ని కొనుగోలు చేస్తే మాత్రం తప్పనిసరిగా కట్టాలి.
పాత కారును విక్రయించినప్పుడు వచ్చిన లాభంపైనే డీలర్లు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. అంతే కానీ ఆ కారును అమ్మిన మొత్తంపై కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.10 లక్షలకు కారును కొనుగోలు చేశాడు. కొంత కాలం వాడిన తర్వాత దాన్ని రూ.8 లక్షలకు ఒక డీలర్ కు విక్రయించాడు. అనంతరం డీలర్ ఆ కారును రూ.9 లక్షలకు మరో వ్యక్తి అమ్మాడు. ఆ సమయంలో డీలర్ కు వచ్చిన లాభం రూ.లక్షపైనే 18 శాతం జీఎస్టీ కట్టాలి. ఒక వేళ ఆ కారును కొనడానికి ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో డీలర్ దాన్ని రూ.8 లక్షల కంటే తక్కువకు అమ్మేశాడు. ఈ లావాదేవీలో అతడికి నష్టం వచ్చింది. కాబట్టి జీఎస్టీ కట్టనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెకండ్ హ్యాండ్ కార్ల పరిశ్రమను దెబ్బతీస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి