AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MEIL Project in Mongolia: మంగోలియాలో మెగా క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ నిర్మాణం.. రూ.5,400 కోట్లతో ప్రాజెక్టు..

MEIL Project in Mongolia: మంగోలియాలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను MEIL చేపట్టబోతోంది. ఆ దేశంలో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు చేపట్టిన మేఘా సంస్థ.. మూడో ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కూడా ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మెగా క్రూడ్ ఆయిల్ రిఫైనరీని నిర్మించనుంది. ఇప్పటికే మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని 598 మిలియన్ అమెరికన్ డాలర్లతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూడు ప్రోజెక్టుల విలువ 1. 436 బిలియన్ అమెరికన్ డాలర్లు.

MEIL Project in Mongolia: మంగోలియాలో మెగా క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ నిర్మాణం.. రూ.5,400 కోట్లతో ప్రాజెక్టు..
MEIL project in Mongolia
Sanjay Kasula
|

Updated on: Sep 29, 2023 | 10:01 PM

Share

మంగోలియాలో అత్యాధునిక క్రూడ్ ఆయిల్ రిఫైనరీని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మించనుంది. ఆయిల్ వెలికితీత, రవాణా, శుద్ధి రంగాల్లో ఇప్పటికే సేవలు అందించటంతో పాటు ఆన్ షోర్, ఆఫ్ షోర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా సంస్థ మంగోలియాలో చేపట్టిన మూడో ప్రాజెక్ట్ ఇది. దీని విలువ 648 మిలియన్ అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో 5400 కోట్ల రూపాయలు.

ఇప్పటికే మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని 598 మిలియన్ అమెరికన్ డాలర్లతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 189 మిలియన్ల అమెరికన్ డాలర్లతో క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను కూడా మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. ఈ మూడు ప్రోజెక్టుల విలువ 1.436 బిలియన్ అమెరికన్ డాలర్లు.

ఇటీవల మంగోల్ రిఫైనరీ సంస్థ నుంచి లెటర్ అఫ్ అగ్రిమెంట్‌ను మేఘా సంస్థ అందుకుంది. రిఫైనరీ నిర్మాణ ఒప్పందంపై శుక్రవారం మంగోల్ రిఫైనరీ, మేఘా ఇంజనీరింగ్ సంస్థల మధ్య మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌లో ఒప్పందం జరిగింది. MEIL ఎండీ పీ.వీ.కృష్ణారెడ్డి సమక్షంలో మంగోల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్టాన్ట్సెట్సెగ్ దశ్దవా (Dr. Altantsetseg Dashdavaa), MEIL హైడ్రోకార్బన్స్ విభాగం అధ్యక్షుడు పీ.రాజేష్ రెడ్డి సంతకాలు చేశారు.

భారత్, మంగోలియా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు ఈ రిఫైనరీ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అన్నారు మంగోల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్టాన్ట్సెట్సెగ్ దశ్దవా. తమ దేశ అభివృద్ధిలో ఇండియా సహకారం ఎంతో కీలకమైందన్నారు.

ఈపీసీ పద్దతిలో డీజిల్ హైడ్రోట్రేటర్ యూనిట్, హైడ్రోక్రాకర్ యూనిట్, ఎంఎస్ బ్లాక్, విస్ బ్రేకర్ యూనిట్, హైడ్రోజన్ జనరేషన్ యూనిట్, సల్ఫర్ బ్లాక్, ఎల్‌పీజీ ట్రీటింగ్ యూనిట్, హైడ్రోజన్ కంప్రెషన్, డిస్ట్రిబ్యూషన్, మాచింగ్, ప్లాంట్ భవనాలు, శాటిలైట్ రాక్ రూమ్స్, సబ్ స్టేషన్స్‌తో పాటు ఇతర సౌకర్యాలను MEIL నిర్మించనుంది. మంగోలియాలో మైనస్ 35 డిగ్రీల నుంచి ప్లస్ 40 డిగ్రీల వాతావరణంలో క్రూడ్ ఆయిల్ రిఫైనరీని మేఘా ఇంజనీరింగ్ నిర్మించనుంది.

మంగోలియాలో గాసోలిన్ , డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్, ఎల్‌పీజీ తయారీకి ఉపయోగపడే 1.5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్‌ను ఈ ప్రభుత్వ రంగ రిఫైనరీ ఉత్పత్తి చేస్తుంది. మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వామ్యం అయినందుకు తమకు గర్వంగా ఉందన్నారు MEILఎండీ కృష్ణారెడ్డి. నిర్ణీత గడువులోనే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ రిఫైనరీ వల్ల మంగోలియా ఆర్ధికంగా అభివృద్ధి చెందటంతో పాటు, దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అభిప్రాయపడ్డారాయన.

AA + రోబస్ట్ క్రెడిట్ రేటింగ్ ఉన్న MEIL.. ప్రపంచంలోనే అత్యాధునిక రిగ్గులను తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థ. బెల్జియం, ఇటలీ, చిలి, అమెరికాలోని హౌస్టన్, తాజాగా తూర్పు మంగోలియాలో MEIL తన సేవలను అందిస్తోంది. హైడ్రోకార్బన్స్ విభాగంలో సెపరేషన్ యూనిట్స్, డిస్టిలేషన్, డిసాల్టింగ్ ప్లాంట్స్, గ్యాస్ డిహైడ్రాషన్ సౌకర్యాలు, గ్యాస్ కంప్రెషన్ గ్యాస్ పవర్ జనరేషన్ సెటప్స్, స్టోరేజ్ ట్యాంక్ సిస్టమ్స్, ప్లాంట్ పైపింగ్ లాంటి సేవలను మేఘా ఇంజనీరింగ్ అందిస్తోంది. ఇప్పుడు మంగోలియాతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టింది MEIL.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం