Maruti Suzuki Eeco: సూపర్ ప్యాసెంజర్ వ్యాన్ రిలీజ్ చేసిన మారుతీ.. భద్రతా ఫీచర్లు అదిరిపోయాయిగా..!
భారతదేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీగా ఉన్న మారుతీసుజుకీ తాజాగా 2025 వెర్షన్ ఈకోను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో ఈకోలో సరికొత్త భద్రతా ఫీచర్లతో పాటు మరిన్ని సీటింగ్ కాన్ఫిగరేషన్ ఎంపికలను ఇచ్చారు. మారుతీసుజుకీ ఈకో ఇప్పుడు ఓబీడీ2 కంప్లైంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈకో ధరలు రూ.5.69 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతాయి.

మారుతి సుజుకి ఈకోకు సంబంధించిన 7 సీట్ల వేరియంట్ను నిలిపివేసింది. ఈకోకు సంబంధించిన ఐదు సీట్ల వెర్షన్‌లో ఎటువంటి మార్పులు లేవు. అయితే ఆసక్తికరంగా మారుతీ సుజుకీ కంపెనీ 2025 వెర్షన్ ఈకోలో మాత్ర రెండు కొత్త 6 సీట్ల వేరియంట్లను కూడా జోడించింది.యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లను అప్‌డేట్ చేస్తుంది. ప్రయాణించే అందరి ప్రయాణీకులకు సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, ఫోర్స్ లిమిటర్లతో వచ్చే మూడు-పాయింట్ సీట్ బెల్టు కూడా ఉన్నాయి. ఈకో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో జత చేసిన 80 హెచ్‌పీ, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. అయితే తాజా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ20 ఇంధనాన్ని (20 శాతం ఇథనాల్ 80 శాతం పెట్రోల్) ఉంచడానికి ఈకో 2025ను అప్‌డేట్ చేశారు.
ఈకో 2025లో గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని కోరుకునే వారికి 70 హెచ్‌పీ సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. అయితే సీహెన్‌జీ కిట్ 5 సీటర్ వెర్షన్లకు ప్రత్యేకంగా అందుబాటులో ఉందని గమనించడం ముఖ్యం. అయితే 6 సీట్ల ఈకో మోడల్స్ పెట్రోల్ ఇంజిన్తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్‌కు సంబంధించి క్లెయిమ్ చేసిన ఇంధన సామర్థ్యం 19.71 కిలోమీటర్లు కాగా, సీఎన్‌జీ వెర్షన్ 26.78 కిలోమీటర్లుగా ఉంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే 2025 ఈకోలో ఎలాంటి కాస్మెటిక్ మార్పులు లేవు.
ఈకో 2025 వెర్షన్‌లో ఇంటీరియర్ అలాగే ఉంది. అదే డ్యాష్ బోర్డ్ లేఅవుట్ మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. అయితే పిల్లర్లు, రూఫ్ లైన్ల చుట్టూ ఉన్న ట్రిమ్ ఎయిర్‌బ్యాగ్‌లను ఉంచడానికి అప్‌డేట్ చేశారు. మారుతి సుజుకి ఈకోలో ఎయిర్ కండిషనర్, హీటర్, స్లైడింగ్ డ్రైవర్ సీటు, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్, 12 వోల్ట్ యాక్సెసరీ సాకెట్, డోమ్ లాంప్ బ్యాటరీ సేవర్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, సన్‌వైజర్లు, ఫ్రంట్ క్యాబిన్ లాంప్, స్టీరింగ్ లాక్ కూడా ఉన్నాయి. వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..