Real Estate: కొత్త ఇల్లు కొంటున్నారా?.. మరి ఈ విషయాలు తెలుసుకున్నారా?

ఇల్లు కొనడం లేదా కట్టడం ఎవరికైనా చాలా పెద్ద పని. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికైతే ఇది మరింత కష్టం. ఇంటిని కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్, అంశాల గురించి ఓ సారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాచారంతో ఇంటి కొనుగోలు, అమ్మకంలో తలెత్తే సమస్యలు నివారించవచ్చు.

Real Estate: కొత్త ఇల్లు కొంటున్నారా?.. మరి ఈ విషయాలు తెలుసుకున్నారా?
Property Sale
Follow us
Ravi C

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 21, 2024 | 6:03 PM

ఆహారం, బట్టలు, ఇల్లు.. జీవితంలో ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ అవసరాలు తీర్చడంలో ప్రజల జీవితమంతా గడిచిపోతుంది. కాలక్రమేణా కార్లు, స్మార్ట్​ ఫోన్లు వంటి కొన్ని కొత్త అవసరాలు వచ్చినా అతి ప్రధానంగా భావించేవి కూడు, గుడ్డ, నీడ. ప్రస్తుతం ప్రధానంగా మాట్లాడుకోబోయేది ఇల్లు గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల ఉంటుంది. కొత్తగా కట్టుకోవడమో లేదా అప్పటికే కట్టిన ఇంటిని కొనుక్కోవడమో వీలును బట్టి చూస్తారు. కానీ ఇల్లు కొనడం చాలా పెద్ద పని. ఇక అనుభవం లేకుండా మొదటిసారి కొనుగోలు చేసేవారికి ఇది మరింత కష్టంగా ఉంటుంది. అందుకే ఈ కథనంలో ఇలాంటి వారి పనిని తక్కువ చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటిని ఎలా కొనుగోలు చేయాలి? ఎలా అమ్మాలి? అనే అంశాలపై చర్చిద్దాం.

ఆస్తికి సంబంధిన నియమాలు ఎలా ఉంటాయి?

మొదటి అంశం నిర్మాణంలో ఉన్న ఇంటికి, పూర్తయిన వాటి విషయాల్లో నిబంధనలు భిన్నంగా ఉంటాయి. రియల్​ ఎస్టేట్​ చట్టం-2016 ప్రకారం నిర్మాణంలో ఉన్న ఆస్తి, ఇప్పటికే నిర్మించిన ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు విభిన్న పద్ధతులు పాటించాల్సి వస్తుంది. నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు సదరు బిల్డర్​పై ఏవైనా ఫిర్యాదులు ఉంటే రియల్​ ఎస్టేట్​ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ను కొనుగోలుదారుడు ఆశ్రయించాల్సి ఉంటుంది. నిర్మించిన ఆస్తికి సంబందించి ఏదైనా వివాదం ఉంటే జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార ట్రైబ్యునల్​కు కొనుగోలుదారు వెళ్లాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్​ తర్వాతే యాజమాన్యం హక్కు

సరైన రిజిస్ట్రేషన్​ లేకుండా ఎవరూ ఏ ఆస్తిపైనా చట్టపరంగా యాజమాన్య హక్కులు తీసుకోలేరు. ఇండియన్​ స్టాంప్​ చట్టం-1899 ప్రకారం ఆస్తి విలువలో 1 శాతం రిజిస్ట్రేషన్​ ఫీజుగా కొనుగోలుదారు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా స్టాంప్​ డ్యూటీ పేరుతో 4 నుంచి 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలుదారు పూర్తి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ తర్వాతనే ఆస్తికి యజమాని అవుతారు.

అద్దె విషయంలోనూ కొత్త హక్కులు

డ్రాఫ్ట్​ మోడల్​ టెన్నెసీ చట్టం-2015 ప్రకారం రియల్​ ఎస్టేట్​ రంగం తీరును పూర్తిగా మార్చేసింది. ఈ చట్టం ప్రకారం భవనాన్ని అద్దెకు ఇచ్చిన తర్వాత కాల పరిమితిని ప్రకారం యజమాని అందులోకి ప్రవేశించలేడు. ఒకవేళ అత్యవసరమైతే 24 గంటల ముందు రాతపూర్వకంగా నోటీసులు ఇచ్చి ప్రవేశించాల్సి ఉంటుంది.

ఆస్తి అమ్మకంలోనూ..

ఆస్తి విక్రయానికి సంబంధించి కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా ఆస్తిని విక్రయించాలనుకుంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం దాని ద్వారా వచ్చే మూలధన లాభంపై పన్ను (క్యాపిటల్​ గెయిన్​) చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ పన్నును మినహాయించుకోవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వ పథకం సాయం తీసుకోవడం లేదా ఆ డబ్బును వేరే స్థిరాస్తిలో పెట్టుబడి పెడితే ఈ పన్ను నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.