ITR filing: ఐటీఆర్ ఫైలింగ్‌లో మార్పులు.. గమనించకుంటే నష్టపోతారంతే..!
దేశంలో పరిమితికి మించి ఆదాయం సంపాదించేవారందరూ తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయాలి. దాన్ని ఆ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, ఎంత పన్ను కట్టాలో నిర్ణయిస్తారు. 2025-26 అసెస్మెంట్ సంవత్సరానికి (ఏవై) సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ సమర్పించే సమయం ఆశన్నమైంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తూ ఐటీఆర్ అందజేయాలి. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఐటీఆర్ దాఖలు చేయడం మొదలవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆడిట్ అవసరం లేని ఐటీఆర్ లను జూలై 31వ తేదీలోపు సమర్పించాలి. దీనిలో భాగంలో మే మొదటివారం నుంచి పన్ను చెల్లింపుదారులు వాటిని అందజేయడం మొదలు పెడతారు. సాధారణంగా అసెస్మెంట్ సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐటీఆర్ ఫారాలను ప్రభుత్వం తెలియజేస్తుంది. వాటి ఫైలింగ్ ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. కానీ ఈ ఏడాది ప్రభుత్వం పలు మార్పులు తీసుకురావడంతో నోటిఫికేషన్ కు సమయం పట్టింది.
ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్ 29వ తేదీన ఏవై 2025-26 కోసం ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాలను నోటిఫై చేసింది. అలాగే లిస్టెట్ ఈక్విటీల నుంచి రూ.1.25 లక్షల వరకూ ధీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్ఠీసీజీ) పొందే వారు తమ ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడాన్ని సులభతరం చేసింది. ఆ ప్రకారం లిస్టెట్ సెక్యూరిటీలపై (సెక్షన్ 112A) ఎల్టీసీజీ ఉన్న వారందరూ రూ.1.25 లక్షల పరిమితిలోపు ఐటీఆర్-1ను సమర్పించవచ్చు. అంతకు మించి ఆదాయం ఉంటే ఇది వర్తించదు. లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ ట్రస్టు అమ్మకాలపై ఎల్టీసీజీ పన్ను విధిస్తారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి 12.5 శాతంగా ఉంది. అయితే రూ.1.25 లక్షల వరకూ మినహాయింపు ఇస్తారు.
ఐటీఆర్-4 ఫారంలో కూడా మార్పు చేశారు. వ్యాపార ఆదాయంపై ఊహాజనిత పన్నును ఆశ్రయించే చెల్లింపుదారులకు ఇది వర్తిస్తుంది. ఏవై 2025-26 కోసం ఐటీఆర్-4 ఫారంలో సెక్షన్ 112A కింద పన్నుకు లోబడి రూ.1.25 లక్షల పరిమితిలోపు ఎల్టీసీజీ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. కాగా.. ఏడాదికి రూ.50 లక్షల ఆదాయం పొందే వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్-1, ఐటీఆర్-4 పత్రాలను సమర్పించాలి. ఇప్పుడు ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల వరకూ ధీర్ఘకాలిక మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు కూడా ఐటీఆర్-1ను అందజేయవచ్చు. వీరు గతంలో ఐటీఆర్ -2ను దాఖలు చేయాల్సి ఉండేది. ఆదాయపు పన్ను శాఖ తీసుకువచ్చిన కొత్త మార్పు ద్వారా ఐటీఆర్ దాఖలు ప్రక్రియ క్రమబద్ధీకరణ జరుగుతుంది. చిన్న పెట్టుబడిదారులు, జీతం పొందే వ్యక్తులకు సులభంగా ఉంటుంది. తద్వారా సకాలంలో, కచ్చితమైన ఐటీఆర్ సమర్పించడానికి వీలు కలుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








