EV insurance: ఎలక్ట్రిక్ వాహనాలకూ బీమా పాలసీలు.. తీసుకుంటే ఎన్నోప్రయోజనాలు
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు మన దేశంలో టాప్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. ఆధునిక ఫీచర్లు, అవసరాలకు అనుగుణంగా రూపొందించిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తమ స్థోమతకు తగిన విధంగా వివిధ బ్రాండ్లకు చెందిన పలు బైక్ లు, స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలామందికి వీటి బీమా (ఇన్స్యూరెన్స్) విషయంలో పలు సందేహాలు తలెత్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలకు బీమా ఉంటుందా? వాటిని ఎలా తీసుకోవాలి? పెట్రోలుతో నడిచే వాహనాలకు, వీటికి మధ్య తేడా ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బీమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెట్రోలు వాహనమైనా, ఎలక్ట్రిక్ వెహికల్ అయినా బీమాను తప్పనిసరిగా తీసుకోవాలి. వాహనదారుడు ఆర్థికంగా నష్టపోకుండా బీమా కాపాడుతుంది. వాహనాన్ని ఎవ్వరైనా దొంగిలించినా, ప్రమాదం బారిన పడినా రక్షణ కల్పిస్తుంది. సంప్రదాయ వాహనాల బీమాా (పెట్రోలు వాహనాలు) వాటి ఇంజిన్, మెకానికల్ భాగాలను కవర్ చేస్తుంది. ఎలక్ట్రిక్ బైక్ ల బీమా అయితే, వాటిలోని మోటారు, బ్యాటరీ ప్యాక్, అనుబంధ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కు వర్తిస్తుంది.
ప్రస్తుతం అనేక కంపెనీలు ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో బైక్ ఇన్స్యూరెన్సులు అందజేస్తున్నాయి. వాటిని తీసుకునే ముందు బీమా కవరేజీపై అవగాహన పెంచుకోవాలి. ఈ కింద తెలిపిన అంశాలకు పూర్తి కవరేజీ ఉంటేనే మీకు లాభదాయకంగా ఉంటుంది.
థర్గ్ పార్టీ కవరేజీ
బీమా పాలసీలో థర్డ్ పార్టీ కవరేజీ తప్పనిసరిగా ఉండాలి. ఇది అన్ని వాహనాలకు ఎంతో అవసరం. మీ ఈవీ వల్ల థర్డ్ పార్టీ వ్యక్తులు, వాహనాలు, ఆస్తులకు జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది.
సమగ్ర కవరేజీ
సమగ్ర కవరేజీ బీమా పాలసీలు మీ బైక్ కు పూర్తి రక్షణ కల్పిస్తాయి. ప్రమాదాలు, దొంగతనం, వైఫరీత్యాలు తదితర వాటి కారణంగా బైక్ కు కలిగే నష్టాలను భర్తీ చేస్తుంది. మీరు బైక్ నడుపుతూ ఎదుటి వారికి కలిగించే నష్టాన్ని కూడా భరిస్తుంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్ కు అందించే బీమా పాలసీలలో వివిధ యాడ్ ఆన్ కవరేజీలు ఉంటాయి. ఇవి మీ వాహనానికి మరింత రక్షణ కల్పించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి పాలసీ తీసుకునేముందు యాడ్ ఆన్ కవరేజీలను పరిశీలించాలి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాటరీ రక్షణ
ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ అత్యంత ముఖ్యమైన భాగం. అలాగే దాని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యాడ్ ఆన్ కవరేజీ ఉంటే బ్యాటరీ మరమ్మతు ఖర్చులను భర్తీ చేస్తుంది.
రోడ్డు పక్కన సాయం
కొన్నిసార్లు సాంకేతిక లోపం, మరమ్మతుల కారణంగా మీ వాహనం రోడ్డు పక్కన నిలిచిపోవచ్చు. ఈ యాడ్ ఆన్ ఫీచర్ ఉంటే టోయింగ్, ప్లాట్ టైర్ మార్పులు, ఆన్ సైట్ మైనర్ మరమ్మతులను కవర్ చేస్తుంది.
జీరో డిప్రిసియేషన్
ప్రమాదం తర్వాత భర్తీ చేయబడిన భాగాలకు తరుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా, పూర్తి క్లెయిమ్ సెటిల్ మెంట్ పొందటానికి ఉపయోగపడుతుంది. ఈవీలోని ఖరీదైన భాగాలకు చాలా ఉపయోగంగా ఉంటుంది.
గమనించాల్సిన అంశాలు
ఎలక్ట్రిక్ వాహనాలకు బీమా తీసుకునేముందు ఈ కింద తెలిపిన అంశాలను తప్పకుండా గమనించాలి.
బీమా డిక్లేర్డ్ విలువ (ఐడీవీ)
మీ వాహనం చెడిపోయినా, చోరీకి గురైనా మీరు క్లెయిమ్ చేయగల గరిష్ట మొత్తాన్ని ఐడీవీ అంటారు. ఈవీల భాగాల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పాలసీ తీసుకునే ముందు ఐడీవీని గమనించాలి.
బ్యాటరీ కవరేజీ
ఈవీలో బ్యాటరీ ధర చాలా ఎక్కువగా ఉంటుందని ముందే చెప్పుకున్నాం. పాలసీ తీసుకునేటప్పుడు బ్యాటరీతో పాటు ఎలక్ట్రిక్ మోటారు డ్యామేజీ, రీప్లేస్ మెంట్ ఖర్చులను కవర్ చేస్తుందో, లేదో గమనించాలి.
వ్యక్తిగత ప్రమాద కవరేజీ
ప్రమాదం జరిగినప్పుడు వాహన చోదకుడికి కలిగే వైద్య, ఆర్థిక నష్టాలను నుంచి రక్షణ కల్పిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




