Indian Railways: థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ రైళ్ళు.. ప్రయివేట్ ఆపరేటర్ల కోసం లీజుకు రైల్వే కోచ్‌లు..

భారతీయ రైల్వేలు క్రమేపీ ప్రయివేట్ కు పెద్దపీట వేస్తున్నాట్టు కనిపిస్తోంది. ఇందుకోసం కొత్త పథకాలను తెరమీదకు తీసుకువస్తోంది. ఇప్పటికే కొన్ని మార్గాల్లో ప్రత్యేకంగా కొన్ని రైళ్ళను ప్రయివేట్ ఆపరేటర్లకు అప్పచెప్పిన రైల్వే..

Indian Railways: థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ రైళ్ళు.. ప్రయివేట్ ఆపరేటర్ల కోసం లీజుకు రైల్వే కోచ్‌లు..
Indian Railways

Indian Railways: భారతీయ రైల్వేలు క్రమేపీ ప్రయివేట్ కు పెద్దపీట వేస్తున్నాట్టు కనిపిస్తోంది. ఇందుకోసం కొత్త పథకాలను తెరమీదకు తీసుకువస్తోంది. ఇప్పటికే కొన్ని మార్గాల్లో ప్రత్యేకంగా కొన్ని రైళ్ళను ప్రయివేట్ ఆపరేటర్లకు అప్పచెప్పిన రైల్వే.. ఇప్పుడు టూరిస్ట్ ప్రాంతాలకు ప్రయివేట్ భాగస్వామ్యంతో ప్రత్యెక రైళ్ళను నడిపించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనికోసం థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకు గానూ ప్రైవేట్ పార్టీలకు కోచ్‌లను విక్రయించే లేదా లీజుకు ఇచ్చే విధానాన్ని ప్రతిపాదించారు. భారతీయ రైల్వేలు రూపొందిస్తున్న విధానం ప్రకారం, ప్రైవేట్ పార్టీలు త్వరలో సాంస్కృతిక, మతపరమైన, ఇతర పర్యాటక సర్క్యూట్ రైళ్లను నడపడానికి రైల్వే కోచ్‌లను కొనుగోలు చేయడం లేదా లీజుకు తీసుకుని ఆపరేట్ చేయగలవు.

ప్రాజెక్ట్ విధానం..నిబంధనలు..షరతులను రూపొందించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇదీ భారతీయ రైల్వేల ప్రణాళిక

ఈ సౌకర్యం ద్వారా పర్యాటక రంగం సామర్థ్యం పెరుగుతుంది. దీనితో పాటు, పర్యాటక రంగ నిపుణులు మార్కెటింగ్, ఆతిథ్యం,సేవల అనుసంధానం, కస్టమర్ బేస్‌తో పరిచయం, అభివృద్ధి, టూరిస్ట్ సర్క్యూట్‌ల గుర్తింపు వంటి పర్యాటక కార్యకలాపాలలో ప్రయోజనం పొందుతారు. భారతీయ రైల్వే ఆసక్తిగల పార్టీలకు సాంస్కృతిక, మతపరమైన ఇతర పర్యాటక సర్క్యూట్ రైళ్లను నడపడానికి అనుమతిస్తుంది. దీని కోసం, కోచ్ స్టాక్‌ను లీజుకు ఇవ్వడం ద్వారా ప్రజలలో రైలు ఆధారిత పర్యాటకాన్ని విస్తరించడానికి ఒక ప్రణాళిక రూపొందించారు. ఇది పర్యాటకాన్ని పెంపొందిస్తుంది.
కనీసం 16 కోచ్ రైలు కొనాలి

మూలాల ప్రకారం, ఈ పథకం కింద, ఆసక్తి ఉన్నవారు కనీసం 16 కోచ్‌లతో కూడిన రైలును కొనాలి లేదా లీజుకు తీసుకోవాలి. రైల్వే తన ప్రైవేట్ రైళ్లను నడపడానికి ప్రైవేట్ ఆపరేతర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పథకం ప్రకటించారు. రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కోచ్‌లు ఐదు సంవత్సరాల లీజుకు అనుమతిస్తారు. ఆసక్తి ఉన్న వ్యక్తి కోసం వ్యాపార నమూనా (మార్గం, ప్రయాణం, సుంకం) ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ప్రయివేట్ రైళ్ళ కోసం ఏర్పాట్లు..

దేశంలోకి ప్రైవేట్‌ రైళ్ల రాకకు సన్నాహాలు చేస్తున్నట్టు రెండేళ్ళ క్రితమే రైల్వే శాఖ ప్రకటించింది. అందులో భాగంగా మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళికను రచించినట్టు చెప్పింది. అలాగే 2023–24లో 45 రైళ్లు.. 2027 నాటికి మొత్తం 151 రైళ్లు రాబోతున్నాయని పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ఆధునిక ప్యాసింజర్‌ రైళ్లను నడపడం కోసం అప్పట్లోనే రైల్వే శాఖ, ప్రైవేట్‌ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2023 మార్చి నుంచి ప్రైవేట్‌ రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా 151 ప్రైవేట్‌ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్‌ ఉండటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రయాణీకుల రైళ్లు కూత పెట్టలేదు. గూడ్స్ చేరవేతకు సంబంధించి కొన్ని రైళ్లను మాత్రమే అధికారులు పట్టాలెక్కించారు. ఈ సమయంలో ట్రాక్‌లు, ఇతర పనులను పునరుద్ధరించడంపై రైల్వే అధికారులు దృష్టి పెట్టారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది కార్మికులతో మానవశక్తి ద్వారా మరమత్తు పనులను పూర్తి చేయాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో గత బడ్జెట్ లో కూడా రైల్వేల ప్రైవేటీకరణ వైపు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం.

Click on your DTH Provider to Add TV9 Telugu