AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Export’s Ban: చక్కెర ఎగుమతులపై నిషేధం నేటి నుంటే.. ప్రపంచానికి చేదుగా మారనున్న నిర్ణయం.. మనపై ప్రభావం..

Sugar Export's Ban: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మానిటరీ చర్యలే కాకుండా ధరలను నియంత్రించటానికి కొన్ని వస్తువుల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది.

Sugar Export's Ban: చక్కెర ఎగుమతులపై నిషేధం నేటి నుంటే.. ప్రపంచానికి చేదుగా మారనున్న నిర్ణయం.. మనపై ప్రభావం..
Sugar Exports Ban
Ayyappa Mamidi
|

Updated on: Jun 01, 2022 | 9:03 AM

Share

Sugar Export’s Ban: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మానిటరీ చర్యలే కాకుండా ధరలను నియంత్రించటానికి కొన్ని వస్తువుల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. కొద్ది రోజుల క్రితం ఇందులో భాగంగా గోధుమలు, చక్కెరపై కొన్ని ఆంక్షలను అమలు చేస్తోంది. వీటిలో భాగంగా జూన్ 1 నుంచి అక్టోబర్ లో పండగ సీజన్ ముగిసే వరకూ చక్కెర ఎగుమతులను కేంద్రం బ్యాన్ చేసింది. ప్రపంచంలో ఎక్కువ మెుత్తంలో చక్కెర తయారు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉన్నప్పటికీ.. ఉత్పత్తిలో ఎక్కువ శాతం మన దేశం సొంత అవసరాలకోసమే వినియోగిస్తోంది. మరో పక్క ప్రపంచంలో మెుదటి స్థానంలో ఉన్న బ్రెజిల్ లో రైతులు ఇథనాల్ తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నందున ప్రపంచం వ్యాప్తంగా పంచదార కొరత ఏర్పడనుంది.

ప్రపంచంలో రెండవ అతిపెద్ద చక్కెర తయారీదారుగా ఉన్న భారత్.. కజకిస్థాన్ ఆరు నెలల పాటు పంచదార ఎగుమతులపై బ్యాన్ విధించటానికి ఒక్కరోజు ముందుగానే మనదేశం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మార్కెట్లలో 30 శాతం గోధుమలను ఎగుమతి చేసే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉండటం కారణంగా సరఫరాలో అంతరాయాలు ఇతర దేశాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత సంవత్సరం బ్రెజిల్, భారత్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియాలలో మంచి దిగుబడి కారణంగా చక్కెర ధరలు స్థిరంగానే ఉన్నాయి. కానీ.. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రేట్లపై తీవ్ర ప్రభావం ప్రారంభమైంది. మరో పక్క ఇంధన ధరలు అమాంతం పెరుగుతున్న వేళ బయో ఫ్యూయల్ తయారీ కోసం బ్రెజిల్ చక్కెర ఉత్పత్తిని తగ్గించింది. దీని వల్ల ప్రపంచ మార్కెట్లలో కొరత మరింత పెరుగుతోంది. దీనికి తోడు 10వ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుడిగా ఉన్న పాకిస్తాన్ ఈ నెల ప్రారంభంలోనే ఎగుమతులను నిలిపివేయగా.. రష్యా బయట అమ్మకాలను మార్చిలోనే ఆపేసింది.

ఈ ప్రభావం చక్కెర దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన చైనా, ఇండోనేషియా, అమెరికా, అల్జీరియా, సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, మలేషియా, నైజీరియాలపై తీవ్రంగా ఉండనుంది. చాలా దేశాలు ప్రస్తుతం కెనడా, మయన్మార్, మలావీ, సుడాన్ వంటి దేశాలతో దిగుమతి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ప్రభావం చైనా, భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశాలపై వెంటనే ఉండకపోయినప్పటికీ.. దీర్ఘకాలంలో కొంత ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బియ్యం ఎగుమతి నిషేధాన్ని పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం లేనప్పటికీ.. మార్చి-ఏప్రిల్‌లో వేడిగాలులు, రుతుపవనాల ప్రారంభ ఆగమనం అవుట్‌పుట్ లెక్కలను పెంచవచ్చు. ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనుండగా.. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ వంటి ప్రధాన రాష్ట్రాలతో సహా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఉండటంతో ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.