అదిరిపోయే గుడ్‌న్యూస్.. 7 ఏళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు LPG షిప్!
భారత్ చాలా సంవత్సరాల తర్వాత ఇరాన్ నుండి LPGని తిరిగి కొనుగోలు చేసింది, అమెరికా ఆంక్షలను తాత్కాలికంగా సడలించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ LPGతో కూడిన 'అరోరా' ట్యాంకర్ మంగళూరుకు చేరుకుంది. 2019లో ఆగిన ఈ దిగుమతులు, దేశ ఇంధన భద్రతకు కీలకం.

అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను సడలించిన నేపథ్యంలో భారత్ చాలా సంవత్సరాల విరామం తర్వాత ఇరాన్ నుంచి LPG కొనుగోలు చేసినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 2019లో పాశ్చాత్య ఆంక్షల ఒత్తిడి కారణంగా ఇరాన్ నుంచి ఇంధన దిగుమతులను నిలిపివేసిన భారత్, ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ ఆ దిశగా అడుగులు వేయడం గమనార్హం. వాణిజ్య డేటా ప్రకారం ఇరాన్ LPGను తీసుకువస్తున్న అరోరా అనే ట్యాంకర్ కర్ణాటకలోని మంగళూరు పోర్ట్‌కు చేరుకుంది. ఈ ట్యాంకర్ మొదట చైనాకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, మారిన పరిస్థితుల దృష్ట్యా దాని మార్గాన్ని భారత్ వైపు మళ్లించినట్లు సమాచారం. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఇంధన రవాణాలో అంతరాయాలు ఏర్పడటం, భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు సవాళ్లను సృష్టించింది.
ఈ సరుకును దేశంలోని మూడు ప్రధాన పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిన్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ మధ్య పంచుకునే అవకాశముంది. పరిశ్రమ వర్గాల ప్రకారం ఈ కొనుగోలు ఒక మధ్యవర్తి వ్యాపారి ద్వారా జరిగిందని, చెల్లింపులు రూపాయల్లో జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారత్ మరిన్ని ఇరాన్ LPG సరుకులను కొనుగోలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఈ కొనుగోలు విషయంపై స్పష్టత లేకపోవడం గమనించాల్సిన అంశం. కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా మాట్లాడుతూ ఇరాన్ నుంచి ఎలాంటి సరుకులు వచ్చినట్లు తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయిల్ కంపెనీలు, చమురు మంత్రిత్వ శాఖ కూడా స్పందించలేదు.
ప్రస్తుతం ప్రపంచంలో రెండవ అతిపెద్ద LPG దిగుమతిదారైన భారత్, తీవ్ర గ్యాస్ కొరతను ఎదుర్కొంటోంది. గత సంవత్సరం దేశం 33.15 మిలియన్ మెట్రిక్ టన్నుల LPG వినియోగించగా అందులో సుమారు 60 శాతం దిగుమతుల ద్వారానే సరఫరా జరిగింది. ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి మళ్లీ LPG దిగుమతులు ప్రారంభించడం భారత్‌కు సరఫరా భద్రతను మెరుగుపరచడంలో కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే భవిష్యత్‌లో ఆంక్షల పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు ఎలా మారుతాయన్నదే ఈ వాణిజ్య సంబంధాల స్థిరత్వాన్ని నిర్ణయించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
