Petrol Pump: పెట్రోల్ బంక్ పెట్టాలనుకుంటున్నారా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హతలు ఏంటి..?
పెట్రోల్ బంక్ వ్యాపారం మొదలుపెట్టాలని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇది చాలా కష్టతరమైన పని. ఎందుకంటే చాలా రూల్స్ ఉంటాయి. దేశంలో ఒక వ్యక్తి నేరుగా పెట్రోల్, డీజిల్ అమ్మడం అనేది నేరం. కేవలం ఆయిల్ కంపెనీల డీలర్‌షిప్ ద్వారా మాత్రమే విక్రయించాలి.

ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతున్న క్రమంలో పెట్రోల్ బంకుల గురించి చర్చ జరుగుతోంది. దీర్ఘకాలంలో మంచి ఆదాయం సంపాదించాలనుకునేవారికి ఇది మంచి ఆదాయ వనరుగా చెప్పవచ్చు. దీంతో పెట్రోల్ బంకులు స్టార్ట్ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టాలంటే అంత సులువైన పని కాదు. ఇందుకు చాలా నిబంధనలు అమల్లో ఉన్నాయి. కేవలం స్థలం ఉండి డబ్బులు చేతిలో ఉంటే పెట్రోల్ పంప్‌ను స్టార్ట్ చేయలేము. దీనికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విధించిన అనేక నిబంధనలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హుల? స్థలానికి సంబంధించిన నియమాలు ఏంటి? ఎంపిక ఎలా జరుగుతుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
డీలర్‌షిప్ ఎలా పొందాలి?
ఏ వ్యక్తి కూడా నేరుగా పెట్రోల్ లేదా డీజిల్ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించలేరు. కేవలం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం లేదా హిందుస్థాన్ పెట్రోలియంవంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి డీలర్‌షిప్ తీసుకోవడం వల్ల మొదలుపెట్టవచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొన్ని అనువైన ప్రదేశాలను సర్వే చేస్తాయి. వ్యాపార సామర్థ్యం ఉండే ప్రదేశాలను ఎంపిక చేస్తాయి. అనంతరం ఆ ప్రదేశంలో పెట్రోల్ పంపు ఏర్పాటు కోసం ఒక ప్రకటన జారీ చేయబడుతుంది. అప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
– భారత పౌరుడై ఉండాలి
-భారతదేశ నివాసి అయి ఉండాలి
-దరఖాస్తు నాటికి వయస్సు 21 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. అలాగే 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
-కనీస విద్యార్హత 10వ తరగతిఉండాలి.
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
ఆయిల్ కంపెనీకి చెందిన వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమాచారం, కేటగిరీ, భూమి వివరాలను అందించాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ఎలా జరుగుతుంది?
దరఖాస్తులు సమర్పించిన తర్వాత, చమురు సంస్థ అర్హతను ధృవీకరిస్తుంది. అనంతరం లాటరీ లేదా బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా డీలర్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతుంది. డీలర్ షిప్ కోసం ఎంపికైతే ఆ తర్వాత కంపెనీ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫ్ క్రెడెన్షియల్స్ నిర్వహిస్తుంది. భూమి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను చెక్ చేస్తుంది. ఇక పెట్రోల్ బంక్ కోసం ప్రహరీ గోడలు, ట్యాంకులు, పంపిణీ యూనిట్లు, కార్యాలయాలు, స్టోర్ రూములు, రెస్ట్ రూమ్స్, విద్యుత్, నీరు, జనరేటర్లు, గాలి నింపే యంత్రాలు, త్రాగునీరు, అగ్నిమాపక పరికరాలు సమకూర్చుకోవాలి.
