AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Economy: ప్రపంచ దేశాలకు భారత్ గట్టి పోటీ.. వృద్ధి రేటులో భారీగా పురోగతి

సాధారణంగా భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం అనే మాట మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాం. కానీ ఇటీవల భారతదేశంలో ఆర్థిక వృద్ధి విషయంలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలుస్తుంది. గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ సంస్థకు సంబంధించిన యూఎస్ హెడ్ హమీద్ రషీద్ ఇటీవల భారతదేశం వృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కీలక విషయాలను తెలుసుకుందాం.

Indian Economy: ప్రపంచ దేశాలకు భారత్ గట్టి పోటీ.. వృద్ధి రేటులో భారీగా పురోగతి
Indian Economy
Nikhil
|

Updated on: Jan 13, 2025 | 6:52 PM

Share

భారతదేశం ప్రస్తుతం 6.6 శాతం వార్షిక వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రషీద్ అంచనా వేస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఏడాది 6.8 శాతానికి కొద్దిగా వేగంగా వృద్ధి చెందుతుందని వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికపై నిపుణులు తమ అంచనాలను వెల్లడించారు. సేవలు, కొన్ని వస్తువుల వర్గాల్లో ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో బలమైన ఎగుమతి వృద్ధి కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగాల్లో ప్రైవేట్ రంగ పెట్టుబడుల కారణంగా ఈ స్థాయి వ‌ృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మూలధన వ్యయం రాబోయే సంవత్సరంలో వృద్ధిపై బలమైన ప్రభావాలను చూపుతుందని అంచనా వేస్తున్నట్లు ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ద్వారా వెల్లడైంది. 

అలాగే తయారీ రంగంతో పాటు సేవల రంగాల్లో విస్తరణ కారణంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యవసాయ రంగం కూడా 2024లో అనుకూలమైన పరిస్థితుల్లో ఉండడంతో ఉత్పాదకత భారీగా పెరిగింది. గతేడాది 6.8 శాతంగా ఉన్న భారతదేశ వృద్ధి అంచనా ఈ ఏడాది స్వల్పంగా పడిపోయింది, అయితే ప్రపంచ వృద్ధి మందగించిన నేపథ్యంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ర్యాంక్‌ను నిలుపుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా  ప్రపంచ వృద్ధి రేటు ప్రస్తుతం 2.8 శాతంగా ఉంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల వృద్ధి గత ఏడాదితో పోలిస్తే 0.1 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. రెండో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు ఈ సంవత్సరం అంచనా 0.1 శాతం నుంచి 4.8 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఏడాది 0.3 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. 

ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నయూఎస్ ఆర్థిక వ్యవస్థ మరింత జారిపోయింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 1.9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. అంటే గత సంవత్సరం నమోదైన 2.8 శాతం నుంచి 0.9 శాతం మందగించింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశం 6.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఇటీవల విడుదలైన నివేదిక తేలింది. అంటే ఈ వృద్ధి 2024-25 సంవత్సరానికి భారతదేశ జాతీయ గణాంకాల కార్యాలయం 6.4 అంచనా కంటే కొంచెం ఎక్కువగా ఉంది. అలాగే భారతదేశ వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం గత సంవత్సరం అంచనా వేసిన 4.8 శాతం నుండి ఈ సంవత్సరం 4.3 శాతానికి స్వల్పంగా తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 2 నుండి 6 శాతం మధ్యకాలిక లక్ష్య శ్రేణిలో ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

గత సంవత్సరం కూరగాయలు, తృణధాన్యాలు, ఇతర ప్రధానమైన వాటి ధరలు పెరగడానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణమని, అందువల్లే జూన్, సెప్టెంబరులో దేశ ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశ ఉపాధి రంగంలో 2024 అంతటా సూచికలు పటిష్టంగా ఉన్నాయని, శ్రామిక శక్తి భాగస్వామ్యం రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుందని డబ్ల్యూఎస్‌పీ నివేదికలో వెల్లడైంది. గత సంవత్సరం రెండవ త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగిత రేటు 6.6 శాతంగా అంటే 2023లో నమోదైన 6.7 శాతం రేటు నుంచి పెద్దగా మారలేదని ఈ నివేదికలో స్పష్టమైంది. దేశంలో మహిళా కార్మిక మార్కెట్ భాగస్వామ్యంలో పురోగతి ఉన్నప్పటికీ గణనీయమైన లింగ అంతరాలు అలాగే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి