Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ కుదేలు.. రూ.12.39 లక్షల కోట్ల సంపద ఆవిరి
అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు ఆసియా మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారత దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో సోమవారం ఒక్క రోజే మదుపర్ల సంపద ఏకంగా రూ.12.39 లక్షల కోట్లు ఆవిరయ్యింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం (13 జనవరి) నాడు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు ఆసియా మార్కెట్లో నెగటివ్ సెంటిమెంట్ నెలకొనడం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఇన్వెస్టర్లు విక్రయాలపై మొగ్గు చూపడంతో ఉదయం ప్రారంభం నుంచి సాయంత్రం క్లోజింగ్ వరకు సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ కూడా 350 పాయింట్ల నష్టంతో 23,100 పాయింట్ల దిగువున క్లోజ్ అయ్యింది.
బీఎస్ఈ సెన్సెక్స్ 1049 పాయింట్ల నష్టంతో 76,330 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 346 పాయింట్ల నష్టంతో 23,085 పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జొమాటో, ఎల్ అండ్ టీ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అటు అమెరికా డాలర్ విలువ 2022 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది.
భారీ నష్టాల కారణంగా మదుపర్లకు సోమవారంనాడు పీడకలగా మిగిలిపోయింది. ఒక్క రోజే ఏకంగా రూ.12.39 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. మరీ ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్వాప్ ఫండ్స్ ఏకంగా 4 శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. జీవన కాల కనిష్ఠ స్థాయిలో రూ.86.18 డాలర్ల వద్దకు పడిపోయిన రూపాయి మారకం విలువ.. చివరకు రూ. 86.61 వద్ద రూపాయి విలువ స్థిరపడింది. రూపాయి మారకం విలువ 2 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఎగుమతిదారులను ఆందోళనకు గురిచేసే అంశం.