Budget-2022: పీపీఎఫ్ వార్షిక పెట్టుబడి పరిమితి పెంచాల్సిందేనా.. ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారు.
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పీపీఎఫ్ (PPF) ఒకటి. పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి అందిస్తున్న పథకం ఇది...
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పీపీఎఫ్ (PPF) ఒకటి. పెట్టుబడులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి అందిస్తున్న పథకం ఇది. ఇందులో అసలు, వడ్డీ రెండింటిపైనా పన్ను ఆదా చేసుకోవచ్చు. అందువల్ల దీన్ని సేవింగ్స్ కమ్ టాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ అని కూడా అంటారు. ప్రస్తుతం వార్షికంగా 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో గరిష్ఠంగా సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఖాతా నిర్వహణ కోసం వార్షికంగా కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈసారి బడ్జెట్( Budget 2022) నుంచి సామాన్యులు పీపీఎఫ్ విషయంలో ఎలాంటి ఉపశమనం లభించనుందో వేచి చూస్తున్నారు.
వార్షిక పెట్టుబడులు రూ.1.50 లక్షలకు పరిమితం అయినప్పటికీ, సురక్షితమైన స్థిర-ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు, పెట్టుబడి కాలంలో ఆర్జించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. కాబట్టి ఈ పథకంలో పెట్టుబడులను నిపుణులు ప్రోత్సహిస్తుంటారు. ముఖ్యంగా వేతన ఆదాయం లేనివారికీ, స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికీ ప్రభుత్వం హామీ ఉన్న మేలైన పెట్టుబడి పథకం ఇదొకటేనని చెబుతున్నారు.
వార్షిక డిపాజిట్ మొత్తం రూ.1.50 లక్షలకే పరిమితం కావడంతో దీనివల్ల సామాన్యులు పెద్దగా ప్రయోజనం పొందలేకపోతున్నారు. అందుకే పీపీఎఫ్ డిపాజిట్ పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పీపీఎఫ్ ఖాతాలో జమ చేసిన రూ.1.5 లక్షలకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు లభిస్తోంది. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందే గరిష్ఠ మొత్తం కూడా రూ.1.5 లక్షలే కావడంతో.. పీపీఎఫ్‌లో జమ చేసే మొత్తానికీ పన్ను రాయితీ లభిస్తున్నట్లవుతోంది. అయితే, సామాన్యులకు ఊరట కల్పిస్తూ డిపాజిట్ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే.. సెక్షన్ 80సి పరిమితిని కూడా అంతే మొత్తానికి పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పీపీఎఫ్ విధానం ప్రకారం.. ఏటా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తే 7.1 శాతం వడ్డీ లెక్కన 15 ఏళ్లలో రూ.40లక్షలు పొందవచ్చు. ఒకవేళ ఈ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే.. పీపీఎఫ్ మెచ్యూరిటీ సమయానికి రూ.80 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. ఇది సాధ్యం కావాలంటే సెక్షన్ 80సి పరిమితి పెంపుతో పాటు ఆదాయ పన్ను నిబంధనల్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే పీపీఎఫ్ కాలపరిమితిని ఐదేళ్ల చొప్పున పెంచుకునే అవకాశం ఉండడంతో మెచ్యూరిటీ సమయానికి మరింత ఎక్కువ సొమ్మును పొందవచ్చు. వృద్ధాప్యంలో ఇది ఎంతో భరోసాగా ఉంటుంది.
పీపీఎఫ్ ఖాతా తెరిచిన 3-5 సంవత్సరాల మధ్య రుణం పొందే వెసులుబాటు కూడా ఉంది. పీపీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ముపై గరిష్ఠంగా 25 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. వడ్డీ రేటు పీపీఎఫ్ వడ్డీ కంటే 1 శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జమ పరిమితిని పెంచితే.. రుణం మొత్తం కూడా పెరుగుతుంది. అత్యవసర సమయాల్లో ఇది సామాన్యులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Read Also.. TCS: ఐటీ రంగంలో టీసీఎస్ రికార్డు.. ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిన ఐటీ దిగ్గజం..