Income Tax: రికార్డు స్థాయిలో పెరిగిన పన్ను వసూళ్లు.. గతేడాది కంటే 48.41% ఎక్కువ..
దేశంలో పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 48.41 శాతం వరకు పెరిగాయి.
దేశంలో పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 48.41 శాతం వరకు పెరిగాయి. ముందస్తు పన్ను చెల్లింపుల్లోనూ 41 శాతం వృద్ధి నమోదు అయింది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 16 వరకు నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.13.63 లక్షల కోట్లుగా వసూల్ అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకముందు అంచనా వేసిన రూ.11.08 లక్షల కోట్లు, 2022-23 బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్న సవరించిన అంచనా రూ.12.50 లక్షల కోట్లను ఇప్పటికే అధిగమించాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ వసూళ్లు రూ.9.18 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. వ్యక్తుల ఆదాయంపై పన్ను, కంపెనీల లాభాలపై కార్పొరేట్ పన్ను, స్థిరాస్తి పన్ను, వారసత్వపు పన్ను, బహుమతి పన్ను.. వీటిని ప్రత్యక్ష పన్నులుగా వ్యవహరిస్తారు.
మార్చి 15తో గడువు ముగిసిన నాలుగో వాయిదాకు సంబంధించి ముందస్తు పన్నుల వసూళ్లు 40.75 శాతం పెరిగి రూ.6.62 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.87 లక్షల కోట్లను రిఫండ్‌లుగా ఆదాయపు పన్ను విభాగం జారీ చేసింది. మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కార్పొరేట్ పన్నుల వాటా 53 శాతం కాగా.. వ్యక్తుల ఆదాయపు పన్ను వాటా 47 శాతంగా ఉంది. కార్పొరేట్ పన్నుల నికర వసూళ్లు రూ.7,19,035 కోట్లుగాను, వ్యక్తిగత ఆదాయపు పన్నుల వసూళ్లు రూ.6,40,588.30 కోట్లుగాను నమోదయ్యాయి.
దేశం నుంచి వస్తువుల ఎగుమతులు ఈ నెల 14 నాటికి 39,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.29.25 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 40,000 కోట్ల డాలర్లను అధిగమిస్తాయని అంచనా వేశారు. వాహన విడిభాగాల పరిశ్రమ తొలిసారిగా వాణిజ్య మిగులులోకి (60 కోట్ల డాలర్లు) రావడం అభినందనీయమన్నారు. వాహన తయారీ సంస్థలు దిగుమతుల్ని ఆపేసి, స్థానిక ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
Read Also.. Stock Market: ఈ స్టాక్‌ల్లో పెట్టుబడి పెడితే లాభామేనా.. బ్రోకరేజ్ సంస్థలు ఏం చెబుతున్నాయి..