Summer car tips: ఎండలతో కార్లకు తీవ్ర నష్టం.. ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం..
వేసవి నేపథ్యంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉదయం 8 గంటలు దాటితే చాలు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఒక మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రోడ్లపై జన సంచారం కనిపించడం లేదు. అత్యవసర పనులైతే తప్ప మామూలుగా ఎవ్వరూ బయటకు రావడం లేదు. ఎండ వేడిమి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎండ వల్ల మనుషులకే కాదు కార్లకు కూడా అనేక నష్టాలు కలుగుతాయి. వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో ఎండ నుంచి కార్లను రక్షించుకునే చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో కార్లను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండలో డ్రైవింగ్ చేయడం వల్ల మీకు అసౌకర్యం కలగడంతో పాటు కారుకూ నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా విండ్ షీల్డ్ పగుళ్లు తీస్తుంది. పెయింట్ వాడిపోయే ప్రమాదం ఉంది. అధిక వేడి కారణంగా టైర్లు హీటెక్కిపోతాయి. ఇలాంటి సమయంలో ఈ కింద తెలిసిన విధంగా కార్లను సంరక్షించుకోవాలి.
ఎండా కాలంలో కారును వాడకుండా ఇంటిలోనే ఉంచడం కుదరదు. మన అవసరాలకు అనుగుణంగా దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకూ కారును నీడ కింద పార్కు చేయాలి. ఎందుకంటే సుమారు 30 నిమిషాల పాటు కారు ఎండలో ఉంటే లోపలి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. ప్రయాణం సమయంలో ఒక అరగంట పాటు చెట్ల కింద ఆపడం వల్ల మీతో పాటు కారుకు మంచి జరుగుతుంది. క్యాబిన్ చల్లబడడమే కాకుండా పెయింట్, డాష్ బోర్డు లో పగుళ్లు రాకుండా ఉంటాయి.
పార్కింగ్ చేసే ప్రదేశాల్లో నీడ లేనప్పుడు సన్ షేడ్ లు, విండో నైజర్లను ఉపయోగించుకోవాలి. ఇవి సూర్యరశ్మిని నిరోధించి, కారు లోపలి భాగాన్ని చల్లగా ఉంచుతాయి. ముందు వెనుక ఉన్న కిటికీలపై వీటిని ఉంచడం మంచిది. అదే సమయంలో స్టీరింగ్ వీల్, సీట్లపై తువాళ్లు కప్పడం మర్చిపోవద్దు. తువాళ్లపై నీటిని చల్లడం వల్ల మరింత చల్లదనం అందుతుంది. ఈ పద్ధతులు కారు లోపల భాగం వేడెక్కకుండా చూడటానికి ఎంతో సహాయ పడతాయి.
బయట గాలి కారు లోపలకు వెళ్లడానికి వీలుగా, లోపలి భాగం వేడెక్క కుండా ఉండేందుకు కొద్దిగా కిటికీల తెరవడం చాలా మంచిది. దీని వల్ల లోపలి గాలి బయటకు, బయట గాలి లోపలకు వెళ్లి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇటీవల సౌరశక్తితో పనిచేసే ఫ్యాన్లు ఎక్కువగా తయారవుతున్నాయి. వాటిని కారులో ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇంజిన్ ఆఫ్ లో ఉన్నప్పుడు క్యాబిన్ ఉష్ణోగ్రతను సరి చేస్తాయి. ఎండలో పార్కు చేసిన సమయంలోనూ ఉపయోగపడతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








