Tax Saving: ప్రాపర్టీ అమ్ముతున్నారా? ఇలా చేస్తే పన్ను ఆదా చేసుకోవచ్చు..

ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54 ప్రకారం, మీ ఇంటిని అమ్మగా వచ్చిన మూలధన లాభాలను మరో ఇల్లు లేదా స్థలంపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ వ్యక్తి లేదా హెచ్‌యూఎఫ్(హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ) పన్ను మినహాయింపునకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకోసం పన్ను చెల్లింపు దారులు పాత ఇంటిని విక్రయించి రెండేళ్ల లోపు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి.

Tax Saving: ప్రాపర్టీ అమ్ముతున్నారా? ఇలా చేస్తే పన్ను ఆదా చేసుకోవచ్చు..
Tax Saving
Follow us

|

Updated on: Sep 30, 2024 | 6:34 PM

పన్ను పరిధిలోకి వచ్చే వారి ప్రతి ఆర్థిక లావాదేవీపైనా ఆదాయ పన్ను శాఖ పన్ను విధిస్తుంది. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసినా.. అమ్మినా.. ఇలా ఏ పని చేసినా దానిపై ఎంతో కొంత పన్ను పడుతుంది. ఆదాయ పన్ను శాఖ నిబంధనల ప్రకారం ప్రాపర్టీ అమ్మడం ద్వారా వచ్చే లాభాలు, కాల వ్యవధిని బట్టి మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటాయి. ఇది భారీగానే ఉంటుంది. అయితే పన్ను చెల్లింపుదారులకు ఈ మూలధన లాభాల పన్నును ఆదా చేసుకునే అవకాశం ఉంది. అదెలా సాధ్యం? ఆస్తి అమ్మడం ద్వారా పన్నును ఎలా మినహాయించుకోవచ్చు? అందుకు ఉపకరించే చట్టపరమైన వెసులుబాట్లు ఏమిటి? తెలియాలంటే ఈ కథనం చివరి వరకూ చదవండి..

మూలధన లాభం అంటే..

ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీని తక్కువకు కొని, ఎక్కువకు అమ్మడం ద్వారా వచ్చే లాభాన్ని మూలధన లాభం అంటారు. ఆస్తిని ఎంత కాలం తిరిగి పెట్టుబడి పెట్టకుండా హోల్డింగ్ లో ఉంచామనే సమయాన్ని బట్టి వీటిని స్వల్పకాలిక మూలధన లాభాలు(ఎస్టీసీజీ) దీర్ఘకాలిక మూలధన లాభాలు(ఎల్టీసీజీ)గా వర్గీకరిస్తారు. సాధారణంగా 24 నెలలకంటే తక్కువ సమయం ఆస్తిని విక్రయిస్తే దానిని ఎస్టీసీజీ అని, 24నెలలకు పైగా ఉంచి ఆస్తిని అమ్మితే ఎల్టీసీజీ అని పిలుస్తారు. ఎల్టీసీజీపై 20శాతం పన్ను చెల్లించాలి. అయితే దీని విషయంలోనే అనేక రాయితీలు ఆదాయ పన్ను శాఖ అందిస్తుంది.

సెక్షన్ 54..

ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54 ప్రకారం, మీ ఇంటిని అమ్మగా వచ్చిన మూలధన లాభాలను మరో ఇల్లు లేదా స్థలంపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ వ్యక్తి లేదా హెచ్‌యూఎఫ్(హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ) పన్ను మినహాయింపునకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకోసం పన్ను చెల్లింపు దారులు పాత ఇంటిని విక్రయించి రెండేళ్ల లోపు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి. లేదా మూడేళ్ల వ్యవధిలో కొత్త ఇంటిని నిర్మించుకోవాలి. అది మన దేశంలోనే అయి ఉండాలి. ఒకవేళ దీర్ఘకాలిక మూలధన లాభం రూ. 2కోట్లకు పైగా ఉంటే ఆ వ్యక్తి రెండు ప్రాపర్టీలను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే అది ఆ వ్యక్తి తన జీవిత కాలంలో ఒకసారి మాత్రమే కొనుగోలు చేసుకునే వీలుంటుంది. అదే సమయంలో మీరు కొత్త ఇంటిని కొని కొనుగోలు చేసి పన్ను ఆదా కోసం క్లయిమ్ చేసుకొన్న తర్వాత ఆ ప్రాపర్టీని మళ్లీ విక్రయించడానికి వీలుండదు. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఆ ఇంటిని లేదా స్థలాన్ని విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ మూడేళ్ల లోపు విక్రయిస్తే ఆదా చేసిన పన్ను ఆదాయ పన్నుశాఖకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

సెక్షన్ 54ఈసీ..

ఎవరైనా పన్ను చెల్లింపుదారుడు తన ప్రాపర్టీని విక్రయించి.. ఆ నగదును ఆరు నెలల్లోపు ఆ డబ్బును నిర్ధిష్ట బాండ్లపై పెట్టుబడి పెట్టి సెక్షన్ 54ఈసీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ బాండ్లపై రూ. 50లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. ఈ బాండ్లపై పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ తో ఉంటాయి. వడ్డీ రేటు 5.25శాతం ఉంటుంది. ఈ లోపు నగదు ఉపసంహరిస్తే.. ఆ మొత్తంపై పన్ను విధిస్తారు.

క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్(సీఏజీఎస్)..

ఏదైనా ప్రాపర్టీ విక్రయించగా వచ్చిన నగదును కొత్త ప్రాపర్టీ కోసం కాకుండా లేదా బాండ్ల రూపంలోనూ కాకుండా పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ లో కూడా జమచేయొచ్చు. దీని వల్ల కూడా మూలధన లాభాలపై పన్ను ఆదా అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..