Corona Kavach: సామాన్యులకి పెద్ద ఊరట.. ‘కరోనా కవచ్’ ఆరు నెలలు పొడిగింపు..!
Corona Kavach: బీమా నియంత్రణ సంస్థ IRDAI సామాన్యులకి పెద్ద ఊరటనిచ్చింది. ప్రత్యేక కరోనా పాలసీ 'కరోనా కవాచ్'ని మరో 6 నెలల పాటు పొడిగించింది. ఇప్పుడు
Corona Kavach: బీమా నియంత్రణ సంస్థ IRDAI సామాన్యులకి పెద్ద ఊరటనిచ్చింది. ప్రత్యేక కరోనా పాలసీ ‘కరోనా కవచ్’ని మరో 6 నెలల పాటు పొడిగించింది. ఇప్పుడు ఈ పాలసీని సెప్టెంబర్ 30 వరకు ఉపయోగించుకోవచ్చు. ఇంతకుముందు ఈ పాలసీ మార్చి 31, 2022 వరకు మాత్రమే ఉండేది. వాస్తవానికి IRDAI కరోనా కోసం ఈ ప్రత్యేక పాలసీని మార్చి 31, 2021 వరకు జారీ చేసింది. తరువాత మార్చి 31, 2022 వరకు పొడిగించింది. ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు మరోసారి పొడిగించింది. ఈ ప్రత్యేక పాలసీ కోవిడ్-19 సమయంలో వైద్య ఖర్చులను చాలా తక్కువ ప్రీమియంతో కవర్ చేస్తుంది. కరోనా కవచ్ పాలసీకి జనాలలో చాలా మంచి స్పందన వచ్చింది. ఈ కారణంగానే IRDAI ఈ పాలసీ గడువును పొడిగించింది. కరోనా కాలంలో లక్షల మంది ఈ పాలసీని కొనుగోలు చేశారు.
కరోనా కవచ్ పాలసీ అంటే ఏమిటి?
కరోనా కవచ్ పాలసీ అనేది కోవిడ్-19కి సంబంధించి ఆసుపత్రి ఖర్చులను కవర్ చేయడానికి రూపొందించిన ఒక పాలసీ. ఈ పాలసీని తీసుకున్న తర్వాత కోవిడ్ చికిత్సలో అయ్యే అన్ని రకాల వైద్య ఖర్చులకి మీరు పూర్తి రక్షణ పొందుతారు. ఇది ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) సిఫార్సుపై రూపొందించారు. ఈ ప్రత్యేక పాలసీలో మీరు కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు బీమా రక్షణ పొందుతారు. ప్రపంచవ్యాప్త కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ పాలసీని రూపొందించారు. ఈ ప్రత్యేక పాలసీ వ్యవధి 3న్నర నెలలు. 6న్నర నెలలు, 9న్నర నెలలు. అదే సమయంలో పాలసీ ప్రీమియం రూ. 500 నుంచి రూ.6 వేల వరకు ఉంటుంది.
పాలసీని ఎవరు తీసుకోవచ్చు
ఈ పాలసీని 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు ఉండే వ్యక్తులు కొనుగోలు చేయవచ్చు. పాలసీ తీసుకున్న తేదీ నుంచి 15 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది. అంటే ఆ తర్వాత మాత్రమే మీరు దాని ప్రయోజనం పొందుతారు. దీని కింద ఐసియు ఛార్జీలు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు కవర్ అవుతాయి. ఇందులో హాస్పిటల్ బెడ్ ఛార్జీ కూడా కవర్ అవుతుంది. రక్త పరీక్ష, పిపిఈ కిట్, ఆక్సిజన్ ఖర్చు, చెకప్, రోగ నిర్ధారణ ఖర్చును కవర్ చేస్తుంది. ఈ ప్రత్యేక పాలసీలో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కూడా కవర్ అవుతుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 30 రోజుల వరకు వైద్య ఖర్చులు కవర్ అవుతాయి. మీరు ఇంటి దగ్గర నుంచి కరోనా చికిత్స తీసుకుంటే 14 రోజుల పాటు అన్ని ఖర్చులని కవర్ చేస్తుంది.