Gold: పసిడి దూకుడు చూశాక పెరుగుట విరుగుట కొరకే అని అనిగలమా..?
పెరుగుట విరుగుట కొరకే. కానీ బంగారం దూకుడు చూశాక కూడా ఈ మాట అనగలమా. రెండ్రోజులు కాస్త తగ్గిందో లేదో ఇంకేముందీ త్వరలోనే యాభైకో యాభై ఐదు వేలకో వచ్చేస్తుందనుకుంటే.. పదిగ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు రేపోమాపో లకారానికి చేరేలా ఉంది. ట్రంప్ పుణ్యమా అని పసిడి మార్కెట్ ఎగిరెగిరి పడుతోంది. సామాన్యులకు అందనంతగా, అందుబాటులో లేనంతగా రెక్కలొచ్చి పైపైకి ఎగిరిపోతోంది.

ప్రస్తుతం ఊపు చూస్తుంటే గోల్డ్ లక్ష టచ్ చేసేలాగే ఉంది. ఈ వారంలో మొదటి రెండు రోజుల్లో కాస్త తగ్గిన బంగారం ధర మళ్లీ పైపైకి ఎగబాకుతోంది. శనివారం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 96వేల 880కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 89వేల730కి చేరుకుంది. దేశంలో బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ అంచనాలే నిజమైతే పదిగ్రాముల మేలిమి బంగారం ధర ఎనీటైమ్ లక్షని టచ్ చేసేలా ఉంది.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. రెండు దేశాలు పోటీలుపడి పరస్పరం సుంకాలు విధించుకోవడంతో స్పాట్ గోల్డ్ శుక్రవారం యూఎస్‌డీ 3,200 డాలర్ల స్థాయిని దాటింది. అమెరికా డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం కనిష్ట స్థాయిలో 99.78 ఉండటం కూడా బంగారం ధరల పెరుగుదలకు మద్దతిస్తోంది. జ్యుయెల్లర్స్, రిటైలర్స్ నుంచి డిమాండ్, ఆర్థిక, వాణిజ్య పరిణామాలు, మదుపరుల పెట్టుబడులు పసిడి ధరల హైక్‌కి కారణమయ్యాయి. దీంతో ఇంకాస్త తగ్గితే కొందామకున్న ప్రజలు పెరుగుతున్న రేట్లతో బెంబేలెత్తుతున్నారు.
అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ ఉగ్రరూపం దాలుస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు స్టాక్, బాండ్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను సురక్షిత మదుపుగా భావించే పసిడివైపు మళ్లిస్తున్నారని, ఇది కూడా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతోందని మార్కెట్ నిపుణులు ఈ ట్రెండ్‌ని విశ్లేషిస్తున్నారు. కొనుగోలుదారులు, పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతుండటం వల్లే రేట్లు పెరుగుతున్నాయంటున్నారు బులియన్ ట్రేడర్లు. గ్లోబల్ మార్కెట్‌లో 3,254 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది ఔన్స్ బంగారం.
నెల రోజుల్లో పసిడి ధర ఇప్పటికే 7 శాతం పెరిగింది. టారిఫ్ భయాలతో స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంలో పెట్టుబడులు సేఫ్ అని భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. అందుకే ట్రంప్ వచ్చాక పడిపోతుందనుకున్న బంగారం కొత్త రెక్కలు తొడుగుతోంది. ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో రెండు సార్లు రేట్ల కోత చేపట్టవచ్చనే అంచనాలున్నాయి. దీంతో ఈ ఏడాది భారత మార్కెట్లో బంగారం ధర లక్ష మార్క్‌ని దాటే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ప్రపంచ మార్కెట్‌లో ఏప్రిల్ 9నుంచి బంగారం ధరలు పెరుగుతూపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలను తీవ్రతరం చేయడంతో పాటు, ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయనే ఆందోళనలు బంగారంపై ప్రభావం చూపుతున్నాయి. యూఎస్ టారిఫ్‌లకు ప్రతీకారంగా చైనా కూడా ఢీ అంటే ఢీ అంటోంది. ప్రపంచ మార్కెట్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారతీయ మార్కెట్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధర గరిష్ఠ స్థాయిని తాకింది. ఒక్కరోజే 2వేలకు పైగా పెరిగింది.
ప్రతీకార సుంకాలకు అమెరికా అధ్యక్షుడు 90 రోజుల బ్రేక్ ఇచ్చినా చైనాకు మాత్రం ఆ మినహాయింపు ఇవ్వకపోవడం, రెండుదేశాలు అదనపు సుంకాలు వేసుకుంటూ పోతుండటంతో స్పాట్ మార్కెట్‌తోపాటు ఫ్యూచర్ మార్కెట్‌లోనూ గోల్డ్ రన్ కంటిన్యూ అవుతోందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. అమెరికా మార్కెట్లో తొలిసారిగా బంగారం ధర ఔన్స్ 3200 డాలర్లు దాటింది. యూఎస్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రెండు శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ క్షీణించడమే. ప్రపంచ వ్యాప్తంగా ఇతర కరెన్సీలతో పోల్చి చూస్తే డాలర్ విలువ ఊహించని విధంగా తగ్గుతోంది.
ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ హైలో ఉన్నాయి పసిడి ధరలు. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు బంగారం ధరలు ఎంత పెరుగుతాయో అంతే తగ్గే అవకాశం ఉంటుందని అంచనావేస్తోంది స్విట్జర్లాండ్ కు చెందిన యుబీఎస్ బ్యాంక్. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం లేదని, భవిష్యత్తులో అవి కుదుటపడితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందంటోంది యూబీఎస్. అలాగే US ఆర్థిక పరిస్థితులు భవిష్యత్తులో మెరుగుపడితే పడిపోతాయంటున్నారు బ్యాకింగ్ నిపుణులు. ఒకవేళ అదే జరిగితే బంగారం ధరలు దాదాపు 15 శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అసలే ట్రంప్ మొండిఘటం. అదే సమయంలో అన్నమాటపై నిలబడతారనే నమ్మకం కూడా లేదు. దీంతో పెద్దన్న నిర్ణయాల ప్రభావం బంగారం హెచ్చుతగ్గులను ప్రభావితం చేయబోతోంది. తగ్గితే మంచిదే. కానీ గ్యారంటీగా తగ్గుతాయని చెప్పలేం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..