Petrol Vehicles: ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
Petrol Vehicles: వాహనదారులను ఎలక్ట్రిక్ వైపు ప్రోత్సహించేందుకు రవాణా శాఖ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొనేవారికి మొదటి ఏడాది రూ.30 వేల వరకు, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు రూ. 50 వేల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఎన్1 ఎలక్ట్రిక్ ట్రక్కుల..

Delhi EV Policy: దేశ రాజధానిలో పెట్రోల్ బైకులకు కాలం చెల్లనుందా? రాబోయే రోజుల్లో అక్కడ కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే రోడ్లపై కనిపించబోతున్నాయా? అంటే.. అవుననే అంటోంది ఢిల్లీ సర్కార్. కాలుష్యాన్ని తరిమికొట్టడమే లక్ష్యంగా భారీ బడ్జెట్‌తో సరికొత్త ఈవీ పాలసీని తీసుకువచ్చింది. పెట్రోల్ వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తూనే.. EV కొనుగోలుదారులపై సబ్సిడీల వర్షం కురిపించింది. వాహనదారులకు షాకింగ్ అండ్ గుడ్ న్యూస్ ఇస్తున్న ఢిల్లీ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఢిల్లీలో కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘ఢిల్లీ ఈవీ పాలసీ 2026’ను ప్రకటించింది. ఈ కొత్త విధానం 2026 జులై 1 నుంచి అమలుల్లోకి రానుండగా.. 2030 మార్చి 31 వరకు కొనసాగనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఏకంగా 7 వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
కొత్త ఈవీ పాలసీ ప్రకారం.. ఢిల్లీలో సంప్రదాయ ఇంధన వాహనాల రిజిస్ట్రేషన్లను దశలవారీగా నిలిపివేయనున్నారు. 2027 జనవరి 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు, ఎన్1 కేటగిరీ గూడ్స్ వాహనాలకు మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఇక 2028 ఏప్రిల్ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మాత్రమే కొత్తగా రిజిస్టర్ అవుతాయి. అంటే.. 2028 ఏప్రిల్ నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ బైకులు, స్కూటర్ల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్ కానున్నాయి. అయితే ఇప్పటికే రోడ్లపై ఉన్న పాత పెట్రోల్ వాహనాలకు ఈ నిబంధన వర్తించదు అని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్పారు.
ఇది కూడా చదవండి: SIP: కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
వాహనదారులను ఎలక్ట్రిక్ వైపు ప్రోత్సహించేందుకు రవాణా శాఖ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొనేవారికి మొదటి ఏడాది రూ.30 వేల వరకు, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు రూ. 50 వేల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఎన్1 ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.1 లక్ష వరకు ఆర్థికసాయం అందించనున్నారు. వీటితో పాటు పాత వాహనాలను స్క్రాప్ చేస్తే అదనపు డిస్కౌంట్లు లభిస్తాయి. పాత బైకులను స్క్రాప్ చేస్తే రూ.10 వేల వరకు బోనస్ లభిస్తుంది.
అంతేకాదు.. ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. అయితే హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీలు, పన్ను మినహాయింపులు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఛార్జింగ్ సమస్యలు తలెత్తకుండా ఢిల్లీ వ్యాప్తంగా దశలవారీగా 23 వేల ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల బస్సులను సైతం దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరంలో రాబోయే నాలుగేళ్లలో స్వచ్ఛమైన గాలిని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో దేశ రాజధానిలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే హవా సాగించనున్నాయి.
ఇది కూడా చదవండి: Saving Account: బ్యాంకు ఖాతాను మరో నగరానికి మారుస్తున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




