Bharat Mobility Global Expo: అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
మన దేశంలో ఆటోమొబైల్ రంగం క్రమంగా విస్తరిస్తోంది. కార్లు, ద్విచక్ర వాహనాల వినియోగం పెరుగుతోంది. పలు వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులకు ఇక్కడ విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. అంతర్జాతీయ ఆటో మొబైల్ హబ్ గా మన దేశం మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద ఆటో షోకు నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి.
ఢిల్లీ, గ్రేటర్ నోయిడాలోని మూడు వేదికల్లో 2025 జనవరి 17 నుంచి 22 వరకూ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్, మెబిలిటీ ప్లేయర్లను ఒకే చోటుకు తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. ఆసక్తి ఉంటే మీరు కూడా ఈ షోకు వెళ్లవచ్చు. ప్రజలకు ఉచితంగా ప్రవేశం కల్పించారు. ఆటోమొబైల్ గ్లోబల్ ఎక్స్ పో అంటే వాహన జాతర అని చెప్పవచ్చు. ప్రపంచంలోని ఆటో మొబైల్ కంపెనీలన్నీ తమ మోడళ్లను ప్రదర్శిస్తాయి. దేశీయ దిగ్గజాలైన టాటా మోటార్స్, మారుతీ సుజుకీ నుంచి గ్లోబల్ కంపెనీలైన టయోటా, చైనా బీవైడీ వరకూ సుమారు 28 కంపెనీల తమ కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జెనీవా, మ్యూనిక్, డెట్రాయిట్, పారిస్, టోక్యో ఆటో ఎక్స్ పోలను బిగ్ 5 అని వ్యవహరిస్తారు. ఇటీవల అక్కడ పాల్గొంటున్న కంపెనీలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో జరగనున్న ఎక్స్ లో సుమారు 28 కంపెనీలు రానున్నడం మన దేశానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోను సుమారు 200,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ప్రదర్శనలు, సమావేశాలు, ఇంటరాక్టివ్ సెషన్ల కోసం ప్రత్యేక వసతులు కల్పించారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఆటోషోను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అర మిలియన్ మంది సందర్శకులు రానున్నారు. జనవరి 17 నుంచి ఆటో షో ప్రారంభమవుతుంది. తొలిరోజు ప్రత్యేక మీడియా దినోత్సవం జరుగుతుంది. 18న ప్రత్యేక డీలర్ల దినోత్సవం నిర్వహిస్తారు. 19 నుంచి 22 వరకూ ప్రజలను సందర్శనకు అనుమతిస్తారు. ఆరు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 6 వరకు తెరిచి ఉంటుంది. ఈ ప్రదర్శనను ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చు. ముందుగా తమ వివరాలను భారత్ మొబిలిటీ అధికార వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలి.
భారత్ మండపం, యశోభూమి, గ్రేటర్ నోయిడా అనే మూడు వేదికలపై ఎక్స్ పో జరుగుతుంది. వీటి సమీపంలో మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అక్కడ దిగితే సులభంగా ఎక్స్ పోకు చేరుకోవచ్చు. యశోభూమికి వెళ్లేవారు యశోభూమి ద్వారకా సెక్టార్ 25 మెట్రో స్టేషన్ (ఎయిర్ పోర్లు లైన్), భారత్ మండపం వద్దకు వెళ్లేవారు సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ (బ్లూలైన్), నోయిడా కోసం పారి చౌక్ స్టేషన్ (ఆక్వా లైన్)లో దిగాలి. ఆటో ఎక్స్ పో, టైర్ షో, సైకిల్ షో, బ్యాటరీ షో, స్టీల్ పెవిలియన్, నాస్కామ్ మెబిలిటి టెక్ పెవిలియన్ వంటివి భారత్ మండపంలో జరుగుతాయి. ఆటో కాంపోనెంట్స్ షో జనవరి 18 నుంచి 21 వరకూ యశోభూమిలో నిర్వహిస్తారు. కన్స్ట్రిక్షన్ ఎక్విప్మెంట్ ఎక్స్ పో, అర్బన్ మొబిలిటీ, ఇన్ ప్రా షో జనవరి 19 నుంచి 22 వరకూ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో సెంటర్, మార్ట్ లో జరుగుతాయి.
ఎక్స్ పోలో పలు కంపెనీలకు చెందిన వివిధ మోడళ్లను ఆవిష్కరించనున్నారు. వాటిలో మారుతీ సుజుకి ఇ-వితారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాాటా సియోర్రా ఈవీ, విన్ ఫాస్ట్ వీఎఫ్ 7, విన్ ఫాస్ట్ వీఎఫ్ 9, బీవైడీ సీలియన్ 7, ఎంజీ సైబర్ స్డర్ తదితర కార్లు ఉన్నాయి. అలాగే ఎంజీ ఎం9, హీరో ఎక్స్యూమ్ 125 ఆర్, హీరో ఎక్స్యూమ్ 160 ఆర్, టీవీఎస్ అడ్వాంజర్ బైక్, బజాజ్ ఆటో నుంచి రెండో సీఎన్జీ బైక్ విడుదల కానున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి