Debt Mutual Funds: డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బు వెనక్కి తీసుకుంటున్న పెట్టుబడిదారులు..
అంతర్జాతీయ పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరుగుతున్నందున, అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటు పెంపు ప్రారంభించడంతో డెట్ మ్యూచువల్ ఫండ్ల నుంచి గత నెలలో రూ.32,722 కోట్ల నిధులు వెనక్కి మళ్లాయి...
అంతర్జాతీయ పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరుగుతున్నందున, అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటు పెంపు ప్రారంభించడంతో డెట్ మ్యూచువల్ ఫండ్ల నుంచి గత నెలలో రూ.32,722 కోట్ల నిధులు వెనక్కి మళ్లాయి. ఏప్రిల్‌లో రూ.54,656 కోట్లు డెట్ మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చాయని మ్యూచువల్ ఫండ్ల పరిశ్రమ సంఘం యాంఫీ గణాంకాలు చెబుతున్నాయి. 2022 ఏప్రిల్-మే మధ్యలో చూస్తే ఫోలియోల సంఖ్య కూడా 73.43 లక్షల నుంచి 72.87 లక్షలకు తగ్గినట్లు తెలుస్తోంది. డెట్ ఫండ్లను సురక్షిత పెట్టుబడి ఎంపికగా భావిస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో వీటిలోకి పెట్టుబడులు తరలి వస్తుంటాయి.
అయితే వడ్డీ రేట్లు పెరుగుతుండటం స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి, అధిక ప్రతిఫలాలు డెట్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. మదుపర్లు తమ పెట్టుబడి ఎంపికను మార్చుకుంటున్నారని మార్నింగ్‌స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్-మేనేజర్ రీసెర్చ్ కవితా కృష్ణన్ చెప్పారు. మనీ మార్కెట్ ఫండ్ల నుంచి రూ.14,598 కోట్లు నికరంగా వెనక్కి తరలి వెళ్లాయి. తక్కువ కాలావధి ఫండ్ల నుంచి రూ.8,603 కోట్లు, మరింత తక్కువ కాలావధి ఫండ్ల నుంచి రూ.7,105 కోట్లు, లో-డ్యూరేషన్ ఫండ్ల నుంచి రూ.6,716 కోట్లను మదుపర్లు ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో ఈక్విటీల్లోకి పెట్టుబడులు భారీగా పెరిగాయి.