Insurance payment: ఉగ్రదాడిలో మరణిస్తే బీమా వస్తుందా? నిపుణులు చెప్పే విషయం తెలిస్తే షాక్
ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో యుద్ధాలు అనేది సర్వసాధారణమైంది. ముఖ్యంగా భారతదేశంలో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీమా పాలసీదారులకు కొత్త అనుమానాలు వస్తున్నాయి? ఉగ్రదాడిలో మరణిస్తే లేదా యుద్ధ సమయంలో మరణిస్తే సాధారణ పౌరులకు బీమా కంపెనీలు బీమా ఇస్తాయా? అనే అనుమానం అందరికీ వస్తుంది.

జీవిత బీమా అనేది ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా పీఎంజేజేబీవై పేరుతో పౌరులకు తక్కువ ధరలో పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం పెరిగిన ఉగ్రదాడులు, యుద్ధ భయాల నేపథ్యంలో ఈ రెండు దాడుల్లో మరణిస్తే బీమా కంపెనీలు పాలసీను ఇస్తాయా? అనే అనుమానం ఉటుంది. అయితే యుద్ధం లేదా ఉగ్రవాద దాడుల కారణంగా మరణిస్తే పాలసీదారుడు బాధితుడు అవుతాడు. నేరస్తుడు కాదని అందువల్ల మీ బీమా పాలసీ యాక్టివ్‌గా బీమా సొమ్ము ఇస్తారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చాలా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల నిబంధనల్లో యుద్ధం లేదా ఉగ్రవాదం వల్ల మరణం సంభవించినా పాలసీ సొమ్ము ఇస్తామని పేర్కొంటున్నారని చెబుతున్నారు. గతంలో ఇలాంటి హింసాత్మక సంఘటనల వల్ల సంభవించే మరణాలను జీవిత బీమా నుండి మినహాయించేవారు. కానీ ఇప్పుడు చాలా ప్రధాన బీమా సంస్థలు ఆ మరణాలకు కూడా పాలసీను కవర్ చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా మరణాలకు కూడా నామినీలు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
జీవిత బీమా కవరేజీ అనేది “అనిశ్చితం” అయిన సంఘటన కోసం తీసుకుంటూ ఉంటారు. అందువల్ల జీవిత బీమా ప్రమాదాన్ని అంచనా వేయడానికి “అనిశ్చితి” అనే అంశం చాలా ముఖ్యమైనది. ఈ సూత్రం ఆధారంగా యుద్ధం లేదా ఉగ్రవాద దాడులు అనిశ్చిత సంఘటనలు జరిగినా పాలసీదారులకు క్లెయిమ్ సెటిల్ చేయాల్సి ఉంటుంది. అయితే యుద్ధం లేదా ఉగ్రవాద దాడుల కారణంగా మరణాన్ని జీవిత బీమా పాలసీలో కవర్ చేసినప్పటికీ, ఆ వ్యక్తి బాధితుడు, నేరస్థుడు కాదని గమనించడం చాలా ముఖ్యం. నేరాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసిన వారికి చాలా బీమా కంపెనీ పాలసీ రక్షణను అందించవు. అలాగే చాలా జీవిత బీమా పాలసీలో అత్యంత సాధారణ మినహాయింపు మొదటి 12 నెలలు/365 రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటే బీమా క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత ఉండదు.
అలాగే ప్రస్తుతం ఉన్న వైద్య సమస్యలు ముందుగా వెల్లడించకపోతే బీమా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. బీమా చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం, ముఖ్యమైన వాస్తవాలను తప్పుగా సూచించినట్లయితే అటువంటి క్లెయిమ్లను తిరస్కరించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాద బెదిరింపులు, వివిధ ప్రాంతాలలో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నందున జీవిత బీమా కొనుగోలుదారులు ముఖ్యంగా రక్షణ, భద్రత లేదా ప్రమాదానికి గురయ్యే రంగాల్లోని వారు పాలసీ మినహాయింపులపై ఎక్కువ శ్రద్ధ వహించాలని నిపుణులు కోరుతున్నారు. చాలా ప్రధాన బీమా సంస్థలు ఇప్పుడు యుద్ధం, ఉగ్రవాద కవరేజీ ఇస్తునప్పటికీ పాలసీ తీసుకునే నిబంధనలను ఓ సారి తెలుసుకోవడం ఉత్తమం.పాలసీ నిబంధనలు బీమా సంస్థలను బట్టి మారవచ్చు. నిర్దిష్ట అండర్ రైటింగ్ పాలసీల కారణంగా యుద్ధం లేదా ఉగ్రవాద సంబంధిత మరణాలను కొందరు ఇప్పటికీ మినహాయించే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు పాలసీ పత్రాన్ని పూర్తిగా తనిఖీ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




