Deepseek AI: అమెరికానూ వెనక్కునెట్టేసిన చైనా ఏఐ..అతి తక్కువ ఖర్చుతో తయారీ..!
ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఏలుతోందనే చెప్పవచ్చు. అన్ని రంగాల్లో దీని వినియోగం విపరీతంగా పెరిగింది. మనిషి రూపొందించిన ఈ సాంకేతికత.. మానవులకన్నా పనులను వేగవంతంగా, దోషాలు లేకుండా చేస్తోంది. ఆధునిక సమాజంలో మార్కెట్ లోకి వస్తున్న అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లోనూ ఏఐ టెక్నాలజీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు కోట్లాది రూపాయలను ఖర్చు చేసి కొత్త ఏఐ టెక్నాలజీలను రూపొందిస్తున్నాయి. అయితే చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ అతి తక్కువ ఖర్చుతో డీప్ సీక్ అనే ఏఐ టెక్నాలజీని తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)లో ఒకప్పుడు చాట్ జీపీటీ సంచలనం రేపింది. దీని ద్వారా ఏపని నైనా అత్యంత వేగంగా చేసుకునే వీలు కలిగింది. ఆ తర్వాత మైక్రోస్టాఫ్, గూగుల్, మెటా, అమెజాన్ తదితర సంస్థలు ఏఐ విభాగంలోని ప్రవేశించాయి. అయితే దీనిలోె ఎప్పుడూ అమెరికా ఆధిపత్యం.చెలాయిస్తూ వస్తోంది. ఇప్పుడు తెరపైకి వచ్చిన డీప్ సీక్ తో అమెరికా ఆధిపత్యానికి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చాట్ జీపీటీకి పోటీకి నిలిచింది. చైనాకు చెందిన లియాంగ్ వెన్ ఫెంగ్ 2023 మే నెలలో డీప్ సీక్ ఏఐని తీసుకువచ్చారు. అయితే 2025లో ప్రారంభంలో ఇది చాలా పేరులోకి వచ్చింది.
డీప్ సీక్ వీ3, డీప్ సీక్ ఆర్1 పేరిట విడుదల చేసిన కొత్త మోడళ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని పూర్తి ఉచితంగా అందజేయడం విశేషం. దీంతో ఈ మోడళ్లపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఓపెన్ ఏఐ, క్లౌడ్ సోనెట్ తదితర సంస్థలు తమ ఏఐని వినియోగించుకునేందుకు కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. సబ్ స్క్రిప్షన్ లేకుండా కొన్ని సంస్థలు ఏఐ మోడళ్లను అందిస్తున్నాయి. అయితే వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ డీప్ సీక్ వాటికి భిన్నంగా ఎన్నో ప్రయోజనాలను ఉచితంగా అందిస్తోంది. డీప్ సీక్ వీ3 అనేది సాధారణ ప్రయోజన మోడల్ కాగా, డీప్ సీక్ ఆర్1 మరింత లోతుగా ఆలోచిస్తుంది. ప్రత్యర్థులతో పోల్చితే తక్కువ వనరులను ఉపయోగించుకుని ఇవి పనిచేస్తాయి. మిక్స్చర్ ఆఫ్ ఎక్స్ ఫర్డ్ (ఎంఈవో) అనే ఆర్కిటెక్చర్ వల్ల డీప్ సీక్ కు అత్యంత పేరు వస్తోంది. ప్రశ్నలు ప్రాసెస్ చేయడానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ ను తగ్గిస్తుంది. దీని వల్లే డీప్ సీక్ కు వేగవంతమైన పురోగతికి సాధ్యమైంది.
సోషల్ మీడియాతో పాటు యాపిల్ యాప్ స్టోర్స్ లోనూ డీప్ సీక్ అత్యంగా వేగంగా దూసుకెళుతోంది. అమెరికా, యూకే, చైనాలో టాప్ ఫ్రీ అప్లికేషన్ జాబితాలో ఓపెన్ఏఐని దాటేసింది. అంతేకాకుండా అమెరికా టెక్ పరిశ్రమను కుదిపేసింది. డీప్ సీక్ టెక్నాలజీని వినియోగించుకోవడం చాలా సులభం. చాట్ డీప్ సీక్ వెబ్ సైట్ లోకి వెళ్లి మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. అనంతరం ఈ ఏఐ చాట్ బాట్ లను ఉచితంగా వినియోగించుకోవచ్చు. లాగిన్ అయిన వెంటనే డాల్ఫిన్ లోగోతో కూడిన చాట్ పేజీ ఓపెన్ అవుతుంది. వెబ్ పేజీ, యాప్, ఏపీఐ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇంటర్ ఫేస్ పరంగా చాట్ జీపీటీని పోలి ఉంటుంది. తెలుగు భాషలోనూ చాట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే చాట్ జీపీటీకి, డీప్ సీక్ కు మధ్య కొన్ని తేడాలున్నాయి.
ప్రధాన తేడాలివే
- చాట్ జీపీటీ చాట్ బాట్ తో మాట్లాడటానికి ఇష్టపడే వినియోగదారుల కోసం వాయిస్ ఇంటరాక్షన్ అందిస్తుంది. కానీ డీప్ సీక్ లో టెక్ట్స్ ఆధారిత పరస్పర చర్యలకు మాత్రమే పరిమితం చేయబడింది.
- చాట్ జీపీటీలో ఆధునాతన ఫీచర్ల వినియోగించుకోవడానికి చెల్లింపులు జరపాలి. కానీ డీప్ సీక్ లో అన్ని ఉచితంగా చేసుకోవచ్చు.
- కచ్చితమైన సమాధానాలు అందించడంలో చాట్ జీపీటీతో డీప్ సీక్ పోటీ పడుతుంది.
- మొత్తానికి పరిశీలించినప్పడు డీప్ సీక్ కన్నా చాట్ జీపీటీలోనే ఎక్కువ ఫీచర్లు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి