PMJJBY: పేదలకు భరోసా ఇస్తున్న కేంద్ర బీమా పథకం.. కోట్లాది మందికి ఇన్సూరెన్స్ కవరేజీ
ప్రతి ఒక్కరికీ జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. రేపటి రోజు ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఆర్థిక భరోసా, భద్రతకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇలాంటి వాటిలో జీవిత బీమా ముందు వరసలో ఉంటుంది. అనుకోని ఆపద ఎదురైనప్పుడు కుటుంబానికి అండగా ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అండగా నిలుస్తుంది.
పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వాారా దేశ ప్రజలకు బీమా కవరేజీ అందజేస్తుంది. వీటిలో పీఎంజేజేబీవై ద్వారా 21 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.2 లక్షల బీమా కవరేజీ అందించినట్టు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల సోషల్ మీడియా ఎక్స్ లో ఈ వివరాలు వెల్లడించింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ఏడాది పాటు అమలయ్యే బీమా పథకం. దీనిలోని చేరిన వారు ఏ కారణం చేతనైనా మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.2 లక్షల బీమా అందజేస్తారు. 50 ఏళ్లు పూర్తికాకముందే ఈ పథకంలో చేరిన వ్యక్తులు సాధారణ ప్రీమియం చెల్లించిన తర్వాత 55 ఏళ్ల వరకూ జీవిత బీమాను కొనసాగించవచ్చు.
ఈ పథకంలో చేరిన వారు ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లించాలి. ఇప్పటి వరకూ పీఎంజేజేబీవై ద్వారా 21 కోట్ల మందికి జీవిత బీమా కవరేజీ అందించింది. బీమా క్లయిమ్ లుగా రూ.17,211.50 కోట్లు చెల్లించింది. సామాన్యులకు జీవిత బీమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2015లో అందుబాటులోకి తీసుకువచ్చారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతాలు ఉన్న 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న వారందరూ ఈ పథకానికి అర్హులు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకం. దీనికి ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లించాలి.
ప్రమాదంలో పాలసీ దారుడు మరణిస్తే ఆ కుటుంబానికి బీమా అందిస్తారు. ప్రమాదంలో అంగవైకల్యం సంభవించినా కూడా కవరేజీ ఉంటుంది. దేశంలో దాదాపు 48 కోట్ల మంది ఈ పథకంలో కవరేజీ తీసుకున్నారు. బ్యాంకులో ఖాతా ఉన్నవారందరూ ఈ పథకాల ప్రీమియం చెల్లించడానికి ఆటో డెబిట్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఏటా ప్రీమియం ఆటోమేటిక్ గా ఖాతా నుంచి కట్ అవుతుంది. ఆ సమయానికి మీ ఖాతాలో రూ.456 ఉంటే సరిపోతుంది. ప్రతి సంవత్సరం మే 25 నుంచి 31వ తేదీలో ఈ పాలసీకు డబ్బులు కట్ అవుతాయి. అలాగే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాలు దేశంలో 53.13 కోట్లు ఉన్నాయి. వీటిలో రూ.2,31,236 కోట్ల డిపాజిట్లు చేశారు. 2024 ఆగస్టు 15 నాటికి ఖాతాలు 3.6 రెట్టు పెరగడంతో డిపాజిట్లు 15 రెట్లు ఎక్కువయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి