ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా డబ్బు..
ఈ ఏడాది హోలీ కేవలం పండుగగానే కాదు.. లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు అద్భుత నెలగా మారనుంది. మోదీ ప్రభుత్వం డీఏ పెంపుపై తీపి కబురు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ మార్చిలో జీతంతో పాటు ప్రభుత్వం ఇచ్చే డబుల్ గిఫ్ట్ కూడా యాడ్ కానుంది. అది ఏంటంటే ప్రభుత్వం డీఏను 2 శాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. దీంతో డీఏ ఏకంగా 60 శాతానికి చేరుకోనుంది.

హోలీ పండుగ రాకముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో కొత్త రంగులు నిండనున్నాయి. 2026 నూతన సంవత్సరం కానుకగా కేంద్రం కరువు భత్యం పెంపుపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 1.15 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డిసెంబర్ 2025 నాటి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం.. డీఏ లెక్కింపు 60.34 శాతానికి చేరుకుంది. నిబంధనల ప్రకారం దశాంశాలను పరిగణనలోకి తీసుకోరు కాబట్టి, డీఏ 60 శాతంగా ఖరారు కానుంది.
మార్చిలో డబుల్ బొనాంజ
ప్రస్తుత డీఏ 58శాతం ఉండగా.. 2 శాతం పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో అది 60శాతానికి చేరనుంది. ఇది జనవరి 1 నుంచే అమల్లోకి రానుంది. మార్చి మొదటి వారంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ పెంపునకు ఆమోదం లభించే అవకాశం ఉంది. మార్చి నెల జీతంలో పెరిగిన 2శాతం డీఏ కలిసి వస్తుంది. ఈ పెంపు జనవరి 1 నుండి అమలులోకి వస్తుంది కాబట్టి జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు కూడా మార్చి జీతంతో పాటే అందుతాయి.
జీతాల లెక్కలు ఇలా..
ఒక ఉద్యోగి బేసిక్ పే రూ.50,000 అనుకుంటే.. ప్రస్తుత 58శాతం డీఏ ప్రకారం రూ. 29,000 పొందుతున్నారు. డీఏ 60 శాతానికి పెరిగితే ఆ మొత్తం రూ. 30,000 అవుతుంది. అంటే నెలకు రూ. 1,000 చొప్పున అదనపు లాభం ఉంటుంది. అరియర్స్ కూడా కలిపితే మార్చి నెలలో భారీగా నగదు అందుతుంది.
8వ వేతన సంఘంపై ఉత్కంఠ
7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో ముగిసిన నేపథ్యంలో ఈ డీఏ పెంపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 60శాతం డీఏను భవిష్యత్తులో కొత్త బేసిక్ జీతంలో విలీనం చేసే అవకాశం ఉన్నందున ఈ 2 శాతం పెరుగుదల ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ లెక్కింపులో కీలక పాత్ర పోషించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




