BSNL eSIM: బీఎస్‌ఎన్‌ఎల్ ఇ–సిమ్ వచ్చేసింది! డ్యుయల్ సిమ్ ఉన్నవాళ్లకు పండగే!
బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ రీసెంట్ గానే 4జీ నెట్వర్క్ ను లాంఛ్ చేసింది. ఇప్పుడు కొత్తగా ఇసిమ్ సేవలను తీసుకొస్తుంది. ఫిజికల్ సిమ్ అవసరం లేకుండా కేవలం క్యూఆర్ స్కాన్ ద్వారా నెట్ వర్క్ కు కనెక్ట్ అయ్యేలా కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇదెలా పని చేస్తుందంటే..

ఇ-సిమ్ అంటే ఫిజికల్ సిమ్‌కు డిజిటల్ వెర్షన్ అని చెప్పొచ్చు. సాధారణంగా సిమ్ కార్డ్‌ను ఫిజికల్‌గా మొబైల్ సిమ్ స్లాట్‌లో పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇ–సిమ్ అలా కాదు. దీన్ని మొబైల్‌లో ఇన్‌బిల్ట్‌గా కోడ్ రూపంలో ఇన్‌స్టాల్ చేయొచ్చు. అయితే మీ మొబైల్ ఇ–సిమ్‌కు సపోర్ట్ చేసేదై ఉండాలి. ఇప్పటికే ఎయిర్‌టెల్, జియో, వీఐ కంపెనీలు ఇ–సిమ్ సర్వీస్‌ను అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఇ–సిమ్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
క్యూఆర్ కోడ్ ద్వారా..
బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్‌తో కలిసి ఇ–సిమ్ సర్వీస్ ను అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫిజికల్ సిమ్ కార్డు పొందలేని వాళ్లు ఇ–సిమ్ కార్డు సాయంతో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌ను వినియోగించొచ్చు. డ్యుయల్ సిమ్ కలిగిన మొబైల్ యూజర్లు ఫిజికల్ సిమ్ కార్డుతో పాటు ఇ–-సిమ్ కార్డును వినియోగించుకోవచ్చు. కేవలం ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు.
ఇ–సిమ్ సర్వీస్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ముందు తమిళనాడులో ప్రారంభించింది. అక్కడ మంచి స్పందన రావడంతో ఇప్పుడు టాటా కమ్యూనికేషన్స్‌తో కలిసి దేశవ్యాప్తంగా సర్వీస్‌ను విస్తరిస్తోంది. ఈ సర్వీస్ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ కేవలం పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా తన నెట్‌వర్క్‌ను అందించగలుగుతుంది.
సిమ్ డోర్ డెలివరీ
ఇకపోతే బీఎస్ఎన్ఎల్ రీసెంట్‌గా సిమ్ కార్డ్ డోర్ డెలివరీ సేవను అందుబాటులోకి తెచ్చింది. సిమ్ కార్డు పొందడానికి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే సిమ్ కార్డును ఆర్డర్ చేసి పొందొచ్చు. అలాగే సెల్ఫ్ కేవైసీ అనే మరో సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. యూజర్లు డాక్యుమెంట్లు ఆన్‌లైన్ ద్వారా సమర్పించి, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారి పేరుతో సిమ్ కార్డు పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




