Electric car: ఐడియా అదుర్స్! పాత కారుని ఎలక్ట్రిక్ కారుగా మార్చిన యువకుడు!
పాత కారుని చాలామంది సెకండ్స్ లో అమ్మేస్తుంటారు లేదా స్క్రాప్ కు వేస్తుంటారు. అయితే ఢిల్లీలోని ఓ యువకుడు తన పాత కారుకి ఎలక్ట్రిక్ మోటర్ అమర్చి ఈవీ కారుగా మార్చాడు. ఈ ఐడియా చూసి చాలామంది వావ్ అంటున్నారు. మరిన్నివివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీలో పాత కార్లు వాడకంపై నిషేధం ఉండటంతో చాలామంది పాత వాహనాలను అమ్మేస్తున్నారు. అయితే మిహిర్ ఒక యువకుడు తన ట్యాలెంట్ ఉపయోగించి కారుని ఈవీగా మార్చుకున్నాడు. వాళ్ల తాత వాడిన పాత హ్యుందాయ్ శాంత్రో కారుని అమ్మడం ఇష్టం లేక దాన్ని రీమోడలింగ్ చేసి అందులో ఎలక్ట్రిక్ మోటర్ అమర్చాడు. ఇప్పుడు పెట్రోల్ ఖర్చు లేకుండా హాయిగా అందులో తిరుగుతున్నాడు. అసలు అతడు కారుని ఈవీగా ఎలా మార్చాడంటే..
రీడిజైన్ ఇలా..
పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడం అనుకున్నంత ఈజీ కాదు. దానికై చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. మిహిర్ కు స్వతహాగా ఇంజినీరింగ్ స్టూడెంట్ అవ్వడంతో మూడు రోజులు కష్టపడి కారుని ఈవీగా మార్చగలిగాడు. కారులో ఉండే ఇంజిన్ తీసి ఆ ప్లేస్ లో 72 వోల్ట్ మోటారును అమర్చాడు. దానికి కనెక్ట్ చేస్తూ.. కారు దిగువ భాగంలో కొన్ని మార్పులు చేశాడు. ఇక కారు వెనుక భాగంలో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చి కారుని రెడీ చేశాడు. ఆ తర్వాత బ్రేకింగ్ సిస్టమ్ కై మరికొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. దాంతో మరో 12 వోల్ట్ బ్యాటరీని అమర్చి సరికొత్త బ్రేకింగ్ సిస్టమ్ ను డిజైన్ చేశాడు.ఇలా రీడిజైన్ చేసిన ఎలక్ట్రిక్ కారు ఫుల్ ఛార్జ్‌కు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. టాప్ స్పీడు గంటకు 60 కిలోమీటర్లు. ఇలా కారుని ఈవీగా కన్వర్ట్ చేయడానికి మిహిర్ కు కేవలం రూ.2.4 లక్షలు మాత్రమే ఖర్చయింది.
మీరు కూడా చేయొచ్చు
మీరు కూడా పాత కారుని ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవచ్చు. దీనికై మార్కెట్‌లో కొన్ని కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసి మీ కారులో అమర్చుకోవచ్చు. కారు గురించి అవగాహన ఉన్న మంచి టెక్నీషియన్ ను కలిసి మీరు కూడా మీ పాత కారును ఈవీగా మార్చుకోవచ్చు. కారులోని ఇంజిన్ ను రిమూవ్ చేసి ఆప్లేస్ లో ఎలక్ట్రిక్ మోటర్ అమర్చాల్సి ఉంటుంది. మోటర్, బ్యాటరీ.. ఇవన్నీ కిట్ లో లభిస్తాయి. అయితే ఇలా మార్చిన తర్వాత కారు డీటెయిల్స్ ఆర్టీవో ఆఫీస్ లో అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




