AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheque bounce మీరు ఎవరికైనా చెక్ ఇస్తున్నారా? అయితే ఇవి చూసుకోండి.. లేదంటే కోర్టుల చుట్టు తిరగాల్సిందే..!

Cheque bounce: భారతదేశంలో చెక్ బౌన్స్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా చెక్ బౌన్ కేసులు..

Cheque bounce మీరు ఎవరికైనా చెక్ ఇస్తున్నారా? అయితే ఇవి చూసుకోండి.. లేదంటే కోర్టుల చుట్టు తిరగాల్సిందే..!
Shiva Prajapati
|

Updated on: Feb 26, 2021 | 2:55 PM

Share

Cheque bounce: భారతదేశంలో చెక్ బౌన్స్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా చెక్ బౌన్ కేసులు ఇప్పటి వరకు 35 లక్షలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. చెక్ బౌన్స్ కేసుల సంఖ్యను తగ్గేలా చర్యలు తీసుకోండంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ఈ కేసులను త్వరగా పరిష్కరించడానికి అదనపు కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, చెక్ బౌన్స్‌కు సంబంధించి నియమాలు మరింత కఠినతరం చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో చెక్ ఇచ్చే వారు ఎవరైనా సరే.. పలు కీలకమైన విషయాలను గుర్తుంచుకోవాల్సిందే. మీరు ఎవరికైనా చెక్ ఇచ్చి, ఖాతాలో తగినంత డబ్బు లేనట్లయితే చెక్ బౌన్స్ అవుతుంది. దాంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చెక్ బౌన్స్ అవడం వల్ల ఎలాంటి ఇబ్బందు ఎదుర్కోవాల్సి వస్తుంది? అలా ఇబ్బందులు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బౌన్స్ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.. న్యాయవాది చేతన్ పరీక్ తెలిపిన వివరాల ప్రకారం.. చెక్ బౌన్స్ అయితే, సదరు వ్యక్తి మీపై దావా వేయవచ్చు. సెక్షన్ 138 ప్రకారం, చెక్ బౌన్స్‌కు కారకులైన వారిపై కోర్టులో ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఒకవేళ ఈ కేసులో సదరు వ్యక్తి దోషిగా తేలినట్లయితే.. చెక్ మొత్తానికి రెట్టింపు చెల్లించడం, లేదా 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించడం జరుగుతుంది. అయితే, చెక్ బౌన్స్‌పై ఫిర్యాదు చేయాలనుకునే వారు.. చెక్ బౌన్స్ అయిన 30 రోజుల్లోనే లీగల్ నోటీసులు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే.. నోటీసు వచ్చిన తరువాత, డబ్బును తిరిగి ఇవ్వడానికి నిందితుడికి 15 రోజుల సమయం ఇవ్వబడుతుంది. ఆ సమయంలోనూ డబ్బు చెల్లించకపోతే, 16 వ రోజు నుండి 30 రోజుల్లోగా ఫిర్యాదుదారుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లవచ్చు. అందుకే.. లీగల్ నోటీసు అందిన 15 రోజుల్లోనే డబ్బు అందించే అవకాశం ఉంటే వెంటనే ఇచ్చేయండి. లేదంటే.. తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

చెక్కులో తప్పుడు వివరాలు పేర్కొన్నా చర్యలు తప్పవు.. మీరు ఎవరికైనా ఒక చెక్కు ఇచ్చినట్లయితే, దానిపై వేరే వారి పేరు గానీ, వేరే వారి సంతకం గానీ పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది. సెక్షన్ 420, 467,468 ప్రకారం సదరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ కారణంగా ఏదైనా చెక్ ఇచ్చే ముందు చాలా విషయాలు జాగ్రత్తగా చూసుకోవడం అవసరం.

రెంటికి చెడ్డ రేవడిలా.. చెక్ బౌన్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొనే వారు అనేక రకాలుగా నష్టపోతారు. వ్యక్తిగతంగా ఇబ్బందులు పడటమే కాకుండా, లావాదేవీల పరంగానూ నష్టపోవాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్, సివిల్ స్కోర్‌పైనా దీని ప్రభావం పడుతుంది. దీని వల్ల భవిష్యత్‌లో ఎప్పుడైనా రుణాలు పొందాలంటే కష్టతరంగా మారుతుంది.

Also read:

పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ జిల్లాలో మార్కెట్‌లు బంద్.. సామూహిక వివాహాలపై ఆంక్షలు..

మార్నింగ్ బ్రేక్‏ఫాస్ట్‏గా అటుకుల పులిహోర (పోహా).. కేవలం10 నిమిషాల్లోనే.. తింటే మైమరచిపోవాల్సిందే..