Andhra News: బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
శ్రీకాకుళం జిల్లాలో వైన్ షాపులకు మద్యం తీసుకువెళుతుండగా ఓ ఘటన జరిగింది. బొలెరో వాహనంలో అట్ట పెట్టెలలో మద్యం బాటిళ్లను తీసుకు వెళుతున్న క్రమంలో బాక్సులు రోడ్డుపై జారి పడ్డాయి. ఇలా రెండు చోట్ల జరిగింది. అది గమనించకుండా వాహన డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయాడు.
ఇంట్లో ట్యాప్ తిప్పితే మద్యం ధారలా వస్తే ఎంత బాగుండో…రోడ్డుపై మద్యం ఏరులై పారితే మరెంత బాగుండో అని అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొందరు ఊహించుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. నిజమే అలాంటి అద్భుతాలు జరిగితే మందుబాబులకు పండగే మరీ.. అదే జరిగితే వైన్ షాపుల ముందు క్యూలు, మద్యం కోసం వందల రూపాయిలు ఖర్చు పెట్టాల్సి అవసరం ఉండదు. ఆరోగ్యం మాట పక్కన పెడితే పైసా ఖర్చు లేకుండా తాగినోడికి తాగినంత మద్యం మాత్రం ఫుల్లుగా దొరుకుతుంది.
శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి సందర్భమే మందుబాబులకు ఎదురైంది.. జిల్లాలోని పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త పారసాంబగ్రామ సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం బొలెరో వాహనంలో అట్ట పెట్టెలలో మద్యం బాటిళ్లను తీసుకు వెళుతున్న క్రమంలో ఈ దృశ్యం ఆవిష్కృతం అయింది. వాహనం నుండి మద్యం బాటిల్స్‌తో ఉన్న కొన్ని బాక్సులు రోడ్డుపై జారి పడ్డాయి. ఇలా రెండు చోట్ల జరిగింది. మొదట పారసాంబగ్రామ సమీపంలో జరిగింది. కానీ అది గమనించకుండా వాహన డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండవసారి 16వ నంబర్ జాతీయ రహదారిపై శాసనాం గ్రామ సమీపంలోను అదే సీన్ రిపీట్ అయ్యి మరికొన్ని మద్యం బాటిల్స్‌తో ఉన్న బాక్సులు రోడ్డుపై జారి పడ్డాయి. ఆ సమయంలో అదే మార్గాన ప్రయాణించిన కొందరు వాహనదారులు తమ వాహనాలను ఆపి మరీ రోడ్డుపై జారిపోయిన మద్యం బాటిల్స్‌ను అందిపుచ్చుకున్నారు. మరికొన్ని బాటిల్స్ మాత్రం గాజు బాటిల్స్‌తో కావడంతో రోడ్డుపై పడిన వెంటనే పగిలిపోగా అందులోని మద్యం రోడ్డుపై ఏరులై పారింది. జారిపడిన మద్యం బాటిల్స్ ఎక్కువగా బ్రాండెడ్ కావడం విశేషం. అసలే శీతాకాలం చలికి తోడు, బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా జిల్లాలో చిరు జల్లులు కూడా తోడవ్వటంతో మద్యం బాటిల్స్ దొరికిన మందుబాబులు పండుగ చేసుకున్నారు. ఇక చివర్లో వచ్చిన వారికి బాటిల్స్ దొరకక పోగా గాజు బాటిల్స్ పగిలి రోడ్డు పాలైన మద్యంతో వాసన గుప్పు మంటూ అటుగా వెల్లే మందుబాబులకు నోరూరించింది.
శ్రీకాకుళం నుంచి పలాస వైన్ షాపులకు మద్యం తీసుకువెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం బాటిల్స్ బాక్సులు రోడ్డుపై జారిపోవటాన్ని శాసనం గ్రామ సమీపంలో గమనించిన బొలెరో వాహనం డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి కూలీలను తెప్పించి మిగిలిన బాక్సులను సరి చేసుకున్నారు. విషయం తెలిసి నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ.. రోడ్డుపై ఉన్న గాజు పెంకులను తొలగించారు. వాహనంలోకి ఓవర్‌గా మద్యం బాటిల్స్ బాక్సులను లోడ్ చేయటం, వాటిని సరిగా కట్టకపోవటంతో జరగాల్సిన నష్టం జరిపోయింది. లక్షల రూపాయిల మేర నష్టం వాటిల్లింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి