Best professions: ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు.. తేల్చిచెప్పిన బిల్ గేట్స్..!
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అనేది ప్రస్తుతం ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. మానవుల మాదిరిగానే అన్ని రకాల పనులు చేస్తూ ఎంతో సహాయ పడుతోంది. అనేక సమస్యలకు చిటికెలో పరిష్కారం చూపుతోంది. దీంతో ఏఐ వినియోగం అన్ని రంగాల్లో విపరీతంగా పెరిగింది. మనిషి రూపొందించిన ఈ టెక్నాలజీ మానవుని మేధస్సుకు మించి పనులు చేస్తోంది.

ఏఐ కారణంగా చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళనలు కూడా ఎక్కువుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోస్టాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మూడు రంగాలపై ఏఐ ప్రభావం ఉండదని, ఆ ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని తెలిపారు. మైక్రోస్టాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో చాలా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉన్నప్పటికి కోడింగ్, ఎనర్జీ మేనేజ్ మెంట్, బయాలజీ రంగాల్లో మాత్రం మనుష్యుల అవసరం తప్పకుండా ఉంటుందన్నారు. ఈ రంగాలపై ఏఐ ప్రభావం ఉండదని, ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు ఏమాత్రం ఇబ్బంది కలగదన్నారు. కాగా.. 2022లో చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి ఏఐ వినియోగం ఎక్కువైంది. జెమినీ, కోపైలట్, డీప్ సీక్ వంటి చాట్ బాట్ లను చాాలామంది రోజువారీ పనుల కోసం వాడుతున్నారు.
కోడింగ్
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థలను డెపలప్ చేసే నిపుణులను కోడర్లు అంటారు. ఒక రంగంగా వీరిని ఏఐ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్స్ అని పిలవొచ్చు. ఏఐ వాడకం పెరిగినా వీరి ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయడానికి కచ్చితత్వం, లాజిక్, నైపుణ్యాలు అవసరం. ఇవి ఏఐకి లేవు. అలాగే డీబగ్గింగ్ చేయడానికి, రిఫైనింగ్ కోసం, అలాగే ఏఐని మెరుగుపర్చడానికి కూడా మానవుల సేవలు అవసరం. కాబట్టి కోడింగ్ రంగంలో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
ఇంధన రంగం
ఇంధన రంగంలో ఏఐ వినియోగం పెరిగినా, మానవుల అవసరం తప్పకుండా ఉంటుంది. శిలాజ ఇంధనాలు, అణుశక్తి, పునరుత్పాదక ఇంధన వనరులతో కూడిన ఈ రంగం అత్యంత కీలకమైంది. అయితే సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, డిమాండ్ ను అంచనా వేయడం, మౌలిక సదుపాయాల నిర్వహణలో ఏఐ ఉపయోగపడుతుంది. కానీ భౌగోళిక రాజకీయ సవాళ్లు, అనూహ్య మార్కెట్ హెచ్చుతగ్గులను స్వతంత్రంగా నిర్వహించలేదు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల పరిష్కారం, విద్యుత్ అంతరాయాలు, వనరుల కొరతను అధిగమించడానికి మానవ నైపుణ్యం చాలా అవసరం.
బయాలజీ
జీవశాస్త్రంలో పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణకు మానవుల ఆలోచన చాాలా అవసరం. ఈ రంగంలో ఏఐ వినియోగం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ మనిషి ప్రమేయం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఏఐకి అద్బుతమైన పరికల్పనలు రూపొందించడం, పరిశోధనలో సహజమైన పురోగతిని సాధించే సామర్థ్యం ఉండదు. కేవలం వ్యాధుల నిర్ధారణకు, జన్యుక్రమాలను విశ్లేషించడానికి, ఔషధ ఆవిష్కరణకు మాత్రం సహాయపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి