BHIM యాప్ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఈ సర్వీస్ ఇప్పుడు ఫ్రీగా యాప్‌లోనే వాడుకోవచ్చు!
BHIM యాప్ వినియోగదారులకు శుభవార్త! ఇకపై మీరు యాప్‌లోనే మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేయవచ్చు. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, NPCI భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫీచర్ క్రెడిట్ స్కోర్ చెకింగ్‌ను సులభతరం చేస్తుంది. ప్రత్యేక లాగిన్‌లు అవసరం లేదు, ఇది క్రెడిట్ అవగాహనను పెంచి, మెరుగైన ఆర్థిక నిర్ణయాలకు సహాయపడుతుంది.

యూపీఐ చెల్లింపుల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న BHIM యాప్‌లో ఇప్పుడు మరో కీలక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు ఇకపై ప్రత్యేక వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లలో లాగిన్ అవాల్సిన అవసరం లేకుండా, నేరుగా BHIM యాప్‌లోనే తమ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకునే అవకాశం కలిగింది. ఈ కొత్త ఫీచర్‌ను ట్రాన్స్‌యూనియన్ సిబిల్, NPCI భీమ్ సర్వీస్ భాగస్వామ్యంతో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలంటే వినియోగదారులు వేరే ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లి, లాగిన్ అయి, వ్యక్తిగత వివరాలను ధృవీకరించాల్సి వచ్చేది. అయితే తాజా అప్‌డేట్‌తో ఈ ప్రక్రియ మరింత సులభమైంది.
వినియోగదారులు ప్రతిరోజూ చెల్లింపుల కోసం ఉపయోగించే యాప్‌లోనే ఇప్పుడు క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్‌ను కూడా చూడవచ్చు. ఆర్థిక నిపుణుల ప్రకారం చాలా మంది రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలో మాత్రమే సిబిల్ స్కోర్‌ను పరిశీలిస్తారు. కానీ రుణ ఆమోదం, వడ్డీ రేట్లు, క్రెడిట్ పరిమితులు వంటి అనేక అంశాలపై సిబిల్ స్కోర్ ప్రభావం చూపుతుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రజల్లో క్రెడిట్ అవగాహన మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించాలంటే ముందుగా BHIM యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. వెర్షన్ 4.0.19, అంతకంటే పై వెర్షన్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
యాప్‌లో సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ విభాగాన్ని ఎంచుకుని, వినియోగదారు అనుమతి ఇచ్చిన తర్వాత స్కోర్, రిపోర్ట్‌ను చూడవచ్చు. ఈ ఫీచర్ పూర్తిగా సమ్మతి ఆధారంగా పనిచేస్తుందని అధికారులు తెలిపారు. వినియోగదారు అనుమతి లేకుండా ఎలాంటి క్రెడిట్ సమాచారం యాక్సెస్ చేయబడదని స్పష్టం చేశారు. అదనంగా క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు, పాత రుణ వివరాలు లేదా చెల్లింపుల లోపాలను కూడా వినియోగదారులు సులభంగా గుర్తించగలుగుతారు. డిజిటల్ చెల్లింపుల యాప్‌లు ఇప్పుడు కేవలం ట్రాన్సాక్షన్‌లకే పరిమితం కాకుండా, పూర్తి స్థాయి ఆర్థిక సేవల వేదికలుగా మారుతున్నాయనే దానికి ఈ కొత్త ఫీచర్ మరో ఉదాహరణగా నిలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
