భారతదేశపు గోల్డ్ సిటీ ఎక్కడ ఉందో తెలుసా? ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ విశేషాలివే!
భారతదేశంలో బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా భావోద్వేగం, సంప్రదాయం, పెట్టుబడికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాలలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. భారతదేశంలో అతిపెద్ద బంగారు మార్కెట్ ఏది అని మీకు తెలుసా? భారతదేశంలోని అతిపెద్ద బంగారు ఆభరణాల మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం.

భారతీయ సంస్కృతిలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మదుపు చేసే సాధనంగానే కాకుండా, సామాజిక హోదాకు చిహ్నంగా కూడా దీనిని భావిస్తారు. అయితే భారతదేశంలో బంగారం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి కేరళ లేదా ముంబై నగరాలు. కానీ, మీకు తెలుసా? ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరాన్ని మన దేశపు గోల్డ్ సిటీ అని పిలుస్తారు.
కాన్పూర్.. భారతదేశపు గోల్డ్ హబ్ చారిత్రాత్మకంగా కాన్పూర్ పారిశ్రామిక నగరంగా పేరుగాంచినప్పటికీ, బంగారం వ్యాపారంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి బిర్యానా రోడ్ (Birhana Road) మార్కెట్ అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో నగల దుకాణాలు ఉన్నాయి. సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో ఉండే రక రకాల డిజైన్లు ఇక్కడ లభిస్తాయి.
ఈ మార్కెట్ కేవలం ఉత్తరప్రదేశ్ ప్రజలకే కాకుండా, పొరుగు రాష్ట్రాల వ్యాపారులకు, కొనుగోలుదారులకు ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడ బంగారం స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గోల్డ్ మార్కెట్లలో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ ప్రాంతం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంది. వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ ప్రతిరోజూ జరుగుతుందని అంచనా.
కాన్పూర్ తర్వాత రాజస్థాన్‌లోని జైపూర్ నగరం కూడా రత్నాలు, బంగారు ఆభరణాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా కుందన్ వర్క్, ప్రాచీన డిజైన్లకు జైపూర్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. దక్షిణాదిలో కేరళ అత్యధిక వినియోగం కలిగిన రాష్ట్రంగా ఉన్నప్పటికీ, వ్యాపార లావాదేవీల పరంగా కాన్పూర్ తనదైన ముద్ర వేసింది.
మీరు గనుక అద్భుతమైన డిజైన్లు, భారీ స్థాయిలో బంగారం విక్రయాలను చూడాలనుకుంటే కాన్పూర్‌లోని బిర్యానా రోడ్‌ను సందర్శించాల్సిందే. భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో ఈ గోల్డ్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వినియోగదారులు కూడా హాల్‌మార్క్, స్వచ్ఛతను గమనించి కొనుగోలు చేయడం ద్వారా ఉత్తమమైన పెట్టుబడిని పొందవచ్చు.




