Banking Act Amendment: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై నలుగురికి ఆ అవకాశం
ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలు లేని వారు ఎవరూ లేరు. దాదాపు ప్రతి పౌరుడికి సేవింగ్స్ ఖాతాలున్నాయి. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా అందరూ అకౌంట్లు నిర్వహిస్తున్నారు. అంతేకాక డిజిటల్ పేమెంట్లు కూడా ఎక్కువగా చేస్తున్నారు. సాధారణంగా ప్రతి ఖాతాకు బ్యాంకులో ఒక నామినీని పెట్టాల్సి ఉంటుంది.

బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసే సమయంలోనే దరఖాస్తులో నామినీ వివరాలు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక నామినీ పేరును మనం పెడతాం. అయితే ఇకపై నలుగురు వరకూ నామినీలను నియమించుకునే అవకాశం కేంద్రం ప్రభుత్వం కల్పిస్తోంది. అందుకో సం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, 2024ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును గత ఏడాది డిసెంబర్లో లోక్ సభ ఆమోదించగా.. రాజ్యసభ గత బుధవారం ఆమోదం తెలిపింది. కేవలం నగదు డిపాజిట్లలోనే కాక ఫిక్స్ డ్ డిపాజిట్లు, లాకర్లు, బీమా పాలసీలు, మరే ఇతర ఆర్థిక సాధనాల్లో అయినా ఇదే విధానం అమలు అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..
కొత్త నామినేషన్ నియమాలు
బహుళ నామినీలను అనుమతించడం వల్ల డిపాజిటర్లకు ఎక్కువ సౌలభ్యం, భద్రత, క్రమబద్ధమైన ఆస్తి బదిలీ ప్రక్రియ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఖాతాదారుడి మరణం తరువాత, నామినీ సంరక్షకుడిగా వ్యవహరిస్తాడు, నిధుల బదిలీ సజావుగా జరగడానికి ఇది దోహదపడుతుంది. అయితే, నామినీ అంతిమ లబ్ధిదారుడు కాదు. బ్యాంకు నుంచి ఖాతా కస్టడీని స్వీకరించడానికి అధికారం ఉన్న వ్యక్తి అని గమనించడం చాలా ముఖ్యం. వారసత్వ చట్టాల ప్రకారం ఆస్తులను నిజమైన వారసులకు పంపిణీ చేయడానికి నామినీ బాధ్యత వహిస్తాడు. ఈ సవరణ బ్యాంకులపై పరిపాలనా భారాన్ని తగ్గించడమే కాకుండా ఖాతాదారులకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.
అన్ క్లయిమ్డ్ డిపాజిట్లకు చెల్లు..
ఈ కొత్త నామినేషన్ విధానం వల్ల క్లయిమ్ చేయని డిపాజిట్లు పేరుకుపోవడం అనే సమస్య ఉత్పన్నం కాదు. 2023 మార్చిలో రూ.62,225 కోట్లుగా ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు మార్చి 2024 నాటికి రూ.78,213 కోట్లకు 26 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదిక వెల్లడించింది. బహుళ నామినీలను అనుమతించడం ద్వారా, ఖాతాదారులు తమ నిధులను వారి ఇష్టానుసారం పంపిణీ చేయవచ్చు, తద్వారా డిపాజిట్లు క్లెయిమ్ చేయబడకుండా పోయే అవకాశం తగ్గుతుంది. ఇది బ్యాంకింగ్ రంగంలో పాలనను బలోపేతం చేస్తుందని.. అలాగే కస్టమర్లకు అదనపు రక్షణను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నామినేషన్ పద్ధతులు..
- ఈ కొత్త సవరణ ద్వారా అందుబాటులోకి వచ్చిన బహుళ నామినేషన్లు రెండు పద్ధతులను పరిచయం చేస్తుంది. అవి వరుసగా ఏకకాలం(సక్సెసివ్), వరుస(సైమల్ టేనియస్). వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
- ఏకకాల నామినేషన్.. ఏకకాలంలో నామినేషన్ చేయడం వల్ల ఖాతాదారులు మరణించిన సందర్భంలో ఖాతా ఆదాయాన్ని పంచుకోవడానికి బహుళ నామినీలను నియమించుకోవచ్చు. పంపిణీ అనేది దామాషా ప్రాతిపదికన జరుగుతుంది, ప్రతి నామినీ ఖాతా విలువలో నిర్దిష్ట శాతాన్ని పొందుతారు. ఉదాహరణకు, మిస్టర్ ‘ఎక్స్’ తన పొదుపు ఖాతాలో రూ. 10 లక్షలు ఉండి, అతని భార్య, కొడుకు, కుమార్తెను 40:30:30 నిష్పత్తిలో ఒకేసారి నామినేట్ చేస్తే, బ్యాంకు అతను మరణించిన తర్వాత నిధులను తదనుగుణంగా పంపిణీ చేస్తుంది. అతని భార్యకు రూ. 4 లక్షలు, అతని కొడుకు, కుమార్తెకు రూ. 3 లక్షలు లభిస్తాయి, ఆ తర్వాత ఖాతా మూసివేస్తారు.
- వరుస నామినేషన్లు.. వరుస నామినేషన్లు ప్రాథమిక నామినీ అందుబాటులో లేనట్లయితే, వారి స్థానంలో ద్వితీయ నామినీని నియమించవచ్చని నిర్ధారిస్తాయి. ఇది స్పష్టమైన, ప్రాధాన్య ఆధారిత వారసత్వ మార్గాన్ని సూచిస్తుంది. ప్రారంభ నామినీ ఆస్తులను క్లయిమ్ చేయలేకపోయినా లేదా ఇష్టపడకపోయినా ఆస్తి పంపిణీ సజావుగా కొనసాగుతుందని ఈ మార్పు నిర్ధారిస్తుంది.
- ఉదాహరణకు, వరుసగా నామినీలుగా ఉన్న A, B, C లను పరిగణిస్తే.. బ్యాంక్ మొదట ఆదాయాన్ని A కి చెల్లించడానికి ప్రయత్నిస్తుంది. A అందుబాటులో లేకుంటే లేదా నిధులను అందుకోలేకపోతే, B కి చెల్లిస్తుంది. B కూడా ఆదాయాన్ని అందుకోలేకపోతే, నిధులు చివరికి C కి వెళ్తాయి. బ్యాంకు లాకర్లలో ఉంచిన వస్తువుల విషయంలో, వరుస నామినేషన్ పద్ధతిని మాత్రమే అనుసరించవచ్చని గమనించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి