Vodafone Idea: వోడాఫోన్ ఐడియా ప్రభుత్వ సంస్థగా మారుతుందా? భారీగా పెరగనున్న కేంద్రం వాటా!
Vodafone Idea: భారతదేశ టెలికాం రంగంపై ప్రభుత్వ పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఇది వొడాఫోన్ ఐడియాకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది. 5G నెట్‌వర్క్, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి కంపెనీకి వీలు కల్పిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి వొడాఫో..

భారత టెలికాం రంగంలో దూసుకుపోయిన వోడాఫోన్ ఐడియా.. ఇప్పుడు వెనుకంజలో ఉంది. వోడాఫోన్ ఐడియాకు మంచి చరిత్ర ఉన్నప్పటికీ టెలికాం రంగంలో వెనుకబడిపోయింది. అప్పుల్లో కూరుపోయింది. టెలికాం రంగంలో ఎన్నో సంస్థలు వచ్చినప్పటికీ ఐడియా మాత్రం తన ప్రయాణాన్ని కొనసాగించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దూకుడు తట్టుకోలేక తన వ్యాపారంలో నష్టాలు చూవి చూసింది వోడాఫోన్ ఐడియా. ఈ క్రమంలో స్పెక్ట్రమ్ చెల్లింపులు చేపట్టడం కూడా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం దాదాపు రూ.37 వేల కోట్ల విలువైన షేర్లను సొంతం చేసుకోనుంది. దాదాపు రూ.36 వేల 950 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలను కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ వాటాలుగా మార్చింది. దీంతో కంపెనీలో భారత ప్రభుత్వానికి ఉన్న వాటాలు 22.6 శాతం నుంచి ప్రస్తుతం 48.99 శాతానికి చేరుకున్నాయి.
భారత ప్రభుత్వం త్వరలో ఆ కంపెనీలో తన వాటాను పెంచుకోబోతోంది. స్పెక్ట్రమ్ బకాయిలను ఈక్విటీ షేర్లుగా మార్చడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. ఈ ఒప్పందం విలువ రూ.36,950 కోట్లు. దీని వల్ల ప్రభుత్వ వాటా ప్రస్తుత 22.60 శాతం నుండి 48.99 శాతానికి పెరుగుతుంది. ఈ చర్య సెప్టెంబర్ 2021లో ప్రకటించిన టెలికాం రంగ ఉపశమన ప్యాకేజీలో భాగం. వోడాఫోన్ ఐడియా మార్చి 30న ఈ సమాచారాన్ని పంచుకుంది. టెలికాం మంత్రిత్వ శాఖ మార్చి 29న దీనికి సంబంధించి ఒక ఉత్తర్వును కూడా జారీ చేసింది. దీని కింద ఈ వాటాలను కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 62(4) ప్రకారం ప్రభుత్వానికి బదిలీ చేస్తారు.
ప్రభుత్వానికి ఒక్కో షేరుకు రూ.10 ఇష్యూ ధరకు 3,695 కోట్ల ఈక్విటీ షేర్లు లభిస్తాయి. ఈ ఇష్యూ ధర గత 90 ట్రేడింగ్ రోజులు లేదా 10 ట్రేడింగ్ రోజుల వాల్యూమ్-వెయిటెడ్ సగటు ధర ఆధారంగా నిర్ణయించారు. అందుకే కంపెనీల చట్టంలోని సెక్షన్ 53 కింద కనీస ధర కంటే తక్కువ షేర్లు జారీ చేయరు. కంపెనీ ఇప్పుడు ఈ ప్రక్రియను 30 రోజుల్లోపు పూర్తి చేయాలి. అయితే ఇది సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా), ఇతర నియంత్రణ సంస్థల ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.
ఈ ఒప్పందం తర్వాత ప్రభుత్వ వాటా 48.99 శాతానికి పెరగవచ్చు. కానీ వోడాఫోన్ ఐడియా కంపెనీపై నియంత్రణ దాని ప్రమోటర్లతోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, తద్వారా నియంత్రణా ఆమోదానికి లోబడి వీలైనంత త్వరగా దీనిని అమలు చేస్తామని కంపెనీ తెలిపింది.
ఈ నిర్ణయం భారతదేశ టెలికాం రంగంపై ప్రభుత్వ పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఇది వొడాఫోన్ ఐడియాకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది. 5G నెట్‌వర్క్, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి కంపెనీకి వీలు కల్పిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి వొడాఫోన్ ఐడియా ఈ వాటా బదిలీని ఎలా నిర్వహిస్తుంది? కంపెనీని మార్కెట్లో బలమైన స్థానానికి తిరిగి తీసుకురాగలదా ? అనే దానిపై ఉంది.
ఇది కూడా చదవండి: Ratan Tata: జంతువులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్ టాటా.. ఆయన సంపదలో ఎక్కువ భాగం విరాళాలే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








