Startup News: గూగుల్ మీట్ లో 75 శాతం ఉద్యోగులను తొలగించిన బెంగళూరు స్టార్టప్.. పూర్తి వివరాలు..
Startup News: గత కొంత కాలంగా దేశంలోని స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగులను తొలగించటం సర్వ సాధారణంగా మారింది. అనేక కంపెనీలు తమ ఉద్యోగులను వందల సంఖ్యలో ఫైర్ చేస్తున్నాయి. తాజాగా..
Startup News: గత కొంత కాలంగా దేశంలోని స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగులను తొలగించటం సర్వ సాధారణంగా మారింది. అనేక కంపెనీలు తమ ఉద్యోగులను వందల సంఖ్యలో ఫైర్ చేస్తున్నాయి. తాజాగా.. బెంగళూరుకు చెందిన హెల్త్-టెక్ స్టార్టప్ MFine.. గూగుల్ మీట్ ద్వారా 600 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో పనిచేస్తున్న మెుత్తం ఉద్యోగుల్లో 75 శాతం మందిని తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని వివిధ డిపార్ట్ మెంట్లు వారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. స్టార్టప్ ఉద్యోగుల తొలగింపుకు ఆర్థిక పరిమితులు కారణమని పేర్కొంది.
“నిన్నటి ఈవెంట్ తర్వాత నా టీమ్ మొత్తం ఏడుస్తోంది. కొందరికి చిన్న పిల్లలు ఉన్నారు, మరికొందరికి గర్భిణీ స్త్రీలు ఉన్నారు. మరికొందరు తొందరగా సంపాదించేవారు. నేను వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాను” అని సంస్థకు చెందిన ఒక ఉద్యోగి చెప్పారు. ఈ స్టార్టప్ కంపెనీ తన వద్ద ఉన్న నిధులను పూర్తిగా ఖాళీ చేసినట్లు నివేదించింది. ఒప్పందాలు పడిపోయినందున సేల్స్, మార్కెటింగ్ టీమ్స్ కూడా రద్దయ్యాయి.
MFine సంస్థ భారీ నష్టాల్లో మునిగిపోయింది. FY21లో స్టార్టప్ రూ. 102 కోట్లకు పైగా పన్ను చెల్లించిన తర్వాత నష్టాన్ని చవిచూసింది. అయితే ఇదే సమయంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ కేవలం రూ. 12.9 కోట్లను మాత్రమే ఆర్జించింది. 2022 ప్రారంభం నుంచి భారతీయ స్టార్టప్‌ల్లో ఖర్చులను తగ్గించడం లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుమారు 5,600 మంది ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. అనాకాడెమీ, వేదాంతు, వైట్‌హాట్ జూనియర్ వంటి కంపెనీలు 2800 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి లేదా బలవంతంగా రాజీనామా చేయించాయి. కరోనా తరువాత ఊపందుకున్న ఆన్ లైన్ ఎడ్యుకేషన్ రంగం.. ఇప్పుడు అత్యంత దారుణంగా దెబ్బతింది.