BharatPe: కొత్త వ్యాపారం ప్రారంభించే పనిలో అష్నీర్ గ్రోవర్.. యూఎస్ ఇన్వెస్టర్లతో చర్చలు..
ఫిన్‌టెక్ కంపెనీ BharatPe సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO అష్నీర్ గ్రోవర్ తన కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నెలరోజుల గొడవల తర్వాత ఫోన్ పే నుంచి విడిపోయిన గ్రోవర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.
ఫిన్‌టెక్ కంపెనీ BharatPe సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO అష్నీర్ గ్రోవర్ తన కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నెలరోజుల గొడవల తర్వాత భారత్ పే నుంచి విడిపోయిన గ్రోవర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. దీనితో అతను తన కొత్త కంపెనీ కోసం 200 నుంచి 300 మిలియన్ డాలర్ల నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో తన కొత్త వెంచర్‌ను ప్రారంభించబోతున్నట్లు గ్రోవర్ స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. అష్నీర్ గ్రోవర్ ఇటీవలే 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మరో కొత్త రంగంలో ప్రకంపనలు సృష్టించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఇప్పుడు ఇది మూడవ యునికార్న్ కోసం సమయం అని అన్నారు.
కొత్త వెంచర్ కోసం యూఎస్ లోని హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లు, ఆఫ్‌షోర్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్లతో ఆయన చర్చలు జరుపుతున్నాడు. కంపెనీని ప్రారంభించడానికి గ్రోవర్ తన వ్యక్తిగత సంపదను కూడా ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం భారత్‌పేలో తనకు ఉన్న వాటాను విక్రయించవచ్చు. BharatPe నుంచి విడిపోయిన తర్వాత కూడా.. గ్రోవర్‌కు 8.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లుగా ఉంది. చాలా మంది ఇన్వెస్టర్లు గ్రోవర్ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్త కంపెనీ గురించి కనీసం ఆరుగురు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గ్రోవర్ గతంలోనూ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. అంతకుముందు షార్క్ ట్యాంక్ ఇండియా అనే రియాల్టీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించి వార్తల్లో నిలిచాడు. జనవరిలో ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఆయన వివాదాలకు కేంద్రంగా నిలిచారు. దీని తరువాత, BharatPe బోర్డు గ్రోవర్, అతని భార్య మాధురీ జైన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. చివరికి, ఈ వివాదం ఫలితంగా గ్రోవర్ భారత్‌పే నుంచి బయటకు రావలసి వచ్చింది. ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే గతేడాది ఆగస్టులో యునికార్న్‌గా మారింది. స్టార్టప్ కంపెనీ విలువ ఒక బిలియన్ డాలర్లు దాటితే దానిని యునికార్న్ అంటారు. BharatPeతో పాటు, గ్రోవర్‌కు దాదాపు 24 స్టార్టప్ కంపెనీల్లో కూడా వాటా ఉంది. BharatPeని ప్రారంభించే ముందు.. అతను కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, గ్రోఫర్స్, PC జ్యువెలర్ లిమిటెడ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి కంపెనీలతో కూడా అనుబంధం కలిగి ఉన్నారు.