old vehicles Pollution: ఆ వాహనాల యజమానులకు షాక్..ఇక రోడ్డుపైకి రావడం కష్టమే..!
ప్రజలు తమ అవసరాలు, పనులు, రవాణా కోసం నిత్యం వివిధ రకాల వాహనాలను వినియోగిస్తారు. వాటిలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, లారీలు, బస్సులు మొదలైనవి ఉంటాయి. వీటి వల్ల మన పనులు సులభంగా కావడం, ఒక చోట నుంచి మరో చోటుకు వేగంగా వెళ్లడం, సరకుల రవాణా తదితర ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అదే సమయంలో ఎక్కువ కాలం ఈ వాహనాలను వినియోగించడం వల్ల నష్టాలు కూడా కలుగుతాయి. వాటిలో కాలుష్యం అత్యంత ప్రధాానమైంది.

ముఖ్యంగా కాలం చెల్లిన (సుమారు 15 ఏళ్లు వినియోగించిన) వాహనాలు విడుదల చేసే వాయువులతో మనం పీల్చే గాలి ఎంతో కలుషితమవుతుంది. ఈ నేపథ్యంలో ఆ వాహనాల వల్ల కలిగే అనర్థాలను తెలుసుకుందాం. కాలం చెల్లిన వాహనాలకు ఇంధన నింపకూడదంటూ ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్ బంకు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఢిల్లీలో జనాభా ఎక్కువ. దానికి అనుగుణంగా వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో మామూలుగానే కాలుష్యం పెరుగుతుంది. దానికి తోడు కాలం చెల్లిన వాహనాల నుంచి వెలువడే వాయువులతో కాలుష్య స్థాయి మరింత అధిక మవుతోంది. దీంతో ఇంధనం నింపకపోతే అలాంటి వాహనాలు రోడ్డుపైకి రావని, తద్వారా గాలి కాలుష్యాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
కాలం చెల్లిన వాహనాల వల్ల గాలి కాలుష్యం పెరుగుతుందనటానికి వివిధ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వాటి ఇంజిన్, ఎగ్జాస్ట్ వ్యవస్థ, ఇతర యంత్ర భాగాలు సహజంగానే అరిగిపోతాయి. ఇంజిన్ లోపల పిస్టన్ రింగులు, వాల్వులు, సీల్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. దీని వల్ల ఇంధనం పూర్తిగా దహనం కాదు. దాని వల్ల కార్బన్ మోనాక్సైడ్ (సీవో), మండని హైడ్రో కార్బన్లు తదితర హానికరమైన వాయువులు గాలిలోకి విడుదలవుతున్నాయి. దీపర్యావరణం దెబ్బతినడంతో పాటు, మనుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అనేక రకాల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
కాలం చెల్లిన వాహనాలలో అప్పటి సాంకేతిక వ్యవస్థ ఉంటుంది. నేటి కాాలానికి అది సరిపోదు. ముఖ్యంగా కాలుష్య కారకాలను ట్రాప్ చేసే, తగ్గించే ఫిల్టర్లు, సెన్సార్లు లేవు. దీంతో కాలుష్య కారకాలు అధికంగా విడుదల అవుతాయి. మన దేశంలో 2020 తర్వాత తయారైన కార్లను భారత్ స్టేట్ 6 (బీఎస్ 6) నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. వీటిలో అధునాతన ఉత్ప్రేరక కన్వర్టర్లు, ఇంధన వ్యవస్థ, హానికారక ఉద్గారాలను పరిమితం చేసే సెన్సార్లు ఉంటాయి.
సాధారణంగా పాత వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండదు. ఆ వాహనం పనిచేసినంత కాలం వినియోగించుకుని, తర్వాత వదిలేద్దామనే భావనలో యజమానులు ఉంటారు. వాటికి క్రమం తప్పకుంగా సర్వీసింగ్, ఆయిల్ మార్పులు, ఫిల్టర్ల భర్తీ చేయించకుండా వదిలేస్తారు. దీంతో మూసుకుపోయిన ఎయిర్ ఫిల్టర్, అరిగిపోయిన స్పార్క్ ప్లగ్, పాత ఇంధన ఇంజెక్టర్ వల్ల కాలుష్య కారక వాయువులు విడుదల అవుతాయి. ముఖ్యంగా పాత డీజిల్ వాహనాల నుంచి శీతాకాలంలో వెలువడే పొగతో ఢిల్లీ నగరాల్లో అప్పటికే ఉండే పొగమంచు తీవ్రతను మరింత పెంచుతోంది. దీని వల్ల దారి కనపడక వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డీజిల్ వాహనాలను పదేళ్ల తర్వాత, పెట్రోలు వాహనాలను 15 ఏళ్లు తర్వాత స్క్రాపింగ్ చేసేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..