వారెవ్వా.. 4వ స్థానంలో భారత్.. 65, 90 స్థానాల్లో చైనా, అమెరికా.. ఎందులో అంటే..?
ఆర్థిక సమానత్వంలో భారత్ టాప్ 5 లోకి దూసుకెళ్లింది. అమెరికా, చైనాలో చివరి స్థానాల్లో ఉంటే భారత్ మాత్రం నాలుగో స్థానంలో నిలిచి భళా అనిపించుకుంది. గత పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన స్కీమ్స్ తో ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత పదేళ్లలో 17.1 కోట్ల మంది తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారు.

భారత్.. అమెరికా, చైనా వంటి అగ్రదేశాలను వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లింది. ఇది ఎవరో కాదు ప్రపంచ బ్యాంకే చెబుతుంది. అయితే దేంట్లో అంటారా..ఆర్థిక సమానత్వంలో.. అవును మన దేశంలో పేదరికం తగ్గుతుంది. గత దశాబ్దంలో 17.1 కోట్ల మంది తీవ్ర పేదరికం నుండి బయటపడినట్లు తెలుస్తోంది. 2011-12లో దేశంలో అత్యంత పేదరికం 16శాతం ఉండగా.. 2022-23లో అది 2.3 శాతానికి వచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికాన్ని తగ్గించడానికి మన దేశం చాలా కాలంగా కృషి చేస్తోంది. మిగితా దేశాలతో పోలిస్తే భారత్ ఇందులో ఆదర్శవంతంగా నిలుస్తోంది. తాజా విడుదలైన గణాంకాలను చూస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. ఆదాయ సమానత్వంలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్రం తీసుకొచ్చినటువంటి పీఎం జన్ ధన్ యోజన, డీబీటీలు, ఆయుష్మాన్ భారత్, స్టాండప్ ఇండియా, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి స్కీంలు ఆదాయ అసమానతలు తగ్గించడంలో దోహదపడినట్లు తెలుస్తోంది.
వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారత్ 25.5 గిని ఇండెక్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. మన దేశం కంటే ముందు సోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ వంటి దేశాలు ఉన్నాయి. చైనా 35.7 పాయింట్లతో 65వ స్థానంలో ఉంటే, అమెరికా 41.8 పాయింట్లతో 90వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 దేశాలు మాత్రమే మధ్యస్తంగా తక్కువ ఆదాయ అసమానతలు ఉన్న గ్రూప్‌లో ఉన్నాయి. వీటిలో ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, పోలాండ్ వంటి దేశాలు ఉన్నాయి.
గిని ఇండెక్స్ అంటే ఏమిటి?
మన దేశంలో కుటుంబాల మధ్య ఆదాయం, సంపద వినియోగం ఎలా పంపిణీ అవుతుందో గిని ఇండెక్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. గిని ఇండెక్స్ విలువ 0 నుండి 100 వరకు ఉంటుంది. 0 స్కోరు అంటే పరిపూర్ణ సమానత్వం ఉన్నట్లు. అయితే 100 ఉంటే అత్యధిక ఆదాయ అసమానత ఉన్న దేశంగా సూచిస్తుంది. గిని ఇండెక్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశంలో ఆదాయ అసమానతలు అంత ఎక్కువగా ఉన్నట్లు అర్థం.