AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Records : 0,0,0,0,0,0,0,0,0,0,0…సున్నాల సునామీ.. టీమిండియా ఖాతాలో అత్యంత ఘోరమైన రికార్డు

T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు.

Cricket Records : 0,0,0,0,0,0,0,0,0,0,0…సున్నాల సునామీ.. టీమిండియా ఖాతాలో అత్యంత ఘోరమైన రికార్డు
Abhishek Sharma
Rakesh
|

Updated on: Feb 23, 2026 | 3:43 PM

Share

T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు. కేవలం 111 పరుగులకే ఆలౌట్ అవడమే కాకుండా, ఈ టోర్నీలో ఎవరూ కోరుకోని ఒక అత్యంత చెత్త రికార్డును భారత్ తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ ఓడిపోవడం ఒక ఎత్తైతే, వరుసగా సున్నాల మీద సున్నాలు చుట్టడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన జట్ల జాబితాలో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు ఏకంగా 11 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడే మూడు సార్లు సున్నాకే అవుట్ అవ్వడం విచారకరం. ఇక ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రెండు సార్లు డకౌట్ అవ్వగా, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా తలోసారి పెవిలియన్ బాట పట్టారు.

ఈ వింత రికార్డులో భారత్ మరెన్నో చిన్న జట్లను కూడా దాటేసింది. గతంలో ఇటలీ ఆటగాళ్లు 8 సార్లు, ఓమన్ ప్లేయర్లు 7 సార్లు సున్నాలకే అవుట్ అయ్యారు. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో కేవలం 6 సార్లు మాత్రమే డకౌట్ అయ్యారు. కానీ ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 టీమ్ అని చెప్పుకునే భారత్, ఏకంగా 11 సార్లు సున్నాకే పరిమితమవ్వడం బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతోంది. సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా ఇషాన్ కిషన్, రింకూ సింగ్, బుమ్రా వంటి ప్రధాన ఆటగాళ్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు.

ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ బాగా దెబ్బతింది. సెమీఫైనల్ చేరాలంటే తదుపరి మ్యాచ్‌లలో జింబాబ్వే, వెస్టిండీస్‌లను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. అయితే అంతకంటే ముందు మన బ్యాటర్లు తమ సున్నాల సెంటిమెంట్‌ను వీడి క్రీజులో నిలదొక్కుకోవడం ముఖ్యం. లేదంటే సౌతాఫ్రికా తన తదుపరి మ్యాచ్‌లలో కూడా గెలిచి టాప్‌లో నిలిస్తే, భారత్ ఇంటి దారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us